మూడు నెలల్లో 203 మలేరియా కేసులు
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:29 AM
జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలుదొర తెలిపారు. ఆయన శుక్రవారం అసిస్టెంట్ మలేరియా అధికారి ఏజె సత్యనారాయణతో కలిసి మండలంలోని కోనాంలో పర్యటించారు.
దోమల నివారణకు రెండో విడత మందు పిచికారీ
జ్వరాలపై ఇంటింటా సర్వే
జిల్లా మలేరియా అధికారి వరహాలుదొర
చీడికాడ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కిముడు వరహాలుదొర తెలిపారు. ఆయన శుక్రవారం అసిస్టెంట్ మలేరియా అధికారి ఏజె సత్యనారాయణతో కలిసి మండలంలోని కోనాంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ వున్న తొట్టెలను, దోమల నివారణ మందు పిచికారీని పరిశీలించారు. వర్షాకాలంలో దోమలబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య నమోదైన 226 మలేరియా పాజిటివ్ కేసులతో పోలీస్తే ఈ ఏడాది తగ్గాయని చెప్పారు. కోనాం పంచాయతీలో 18 మలేరియా కేసులు నమోదు కావడంతో ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మలేరియాకు కారణమైన దోమల నియంత్రణకు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు మొదటి విడత మందును పిచికారీ చేయగా, ప్రస్తుతం రెండో విడతగా ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీ వరకు మందును పిచికారీ చేయిస్తున్నట్టు చెప్పారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారని, ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నట్టయితే మందులు అందిస్తున్నారని, అవసరమైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపుతున్నారని వెల్లడించారు. జిల్లాలోని సాంఘిక, బీసీ ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో కూడా దోమల నివారణ మందును పిచికారీ చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట సబ్‌యూనిట్ ఆఫీసర్ ఎస్‌వీ రమణ, వైద్య సిబ్బంది కె.జగన్, వరలక్ష్మి, కొండమ్మ వున్నారు.