Share News

194 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - May 13 , 2026 | 12:55 AM

బుచ్చెయ్యపేట మండలంలో పోలీసులు 194 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ తుహిన్‌ సిన్హా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

194 కిలోల గంజాయి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గంంజాయి, పట్టుకున్న నిందితులతో ఎస్పీ తుహిన్‌ సిన్హా, పోలీసు అధికారులు

ముగ్గురు నిందితుల అరెస్టు

అనకాపల్లి రూరల్‌/ బుచ్చెయ్యపేట, మే 12 (ఆంధ్రజ్యోతి): బుచ్చెయ్యపేట మండలంలో పోలీసులు 194 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ తుహిన్‌ సిన్హా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

బుచ్చెయ్యపేట మండలంలో బంగారుమెట్ట- అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్‌ వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు, ఈగల్‌ టీమ్‌, స్పెషల్‌ బ్రాంచి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో బంగారుమెట్ట జంక్షన్‌ వైపు నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని ఆపి సోదా చేశారు. కారులో ఆరు గోనె సంచుల్లో ప్యాకింగ్‌ చేసిన గంజాయిని గుర్తించారు. దీనిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పంచనామా నిర్వహించి, గంజాయిని తూకం వేశారు. మొత్తం 194 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించి చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు, డ్రైవర్‌ గొల్లవిల్లి గణేశ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబుగా గుర్తించి అరెస్టు చేశారు. గంజాయితోపాటు మూడు సెల్‌ఫోన్లు, కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్కడ కొనుగోలు చేశారు? ఎక్కడికి రవాణా చేస్తున్నారు? అన్నదానిపై లోతుగా విచారిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావును, పోలీసు సిబ్బందిని ఆచప అభినందించి ప్రశంసాపత్రం, నగదు రివార్డు అందించారు. మీడియా సమావేశంలో డీస్పీ ఎం.శ్రావణి, సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:55 AM