Share News

1-8 తరగతుల పాఠ్య పుస్తకాల మార్పు

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:37 AM

వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాలు మారనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. తొమ్మిది, పది తరగతుల పుస్తకాలు మాత్రం మారవని పేర్కొన్నారు. ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ పుస్తకాలు మారనున్నందున ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామన్నారు.

1-8 తరగతుల  పాఠ్య పుస్తకాల మార్పు

‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌

ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల కోసం

16.2 లక్షల పుస్తకాలు అవసరం

ఇప్పటివరకూ 11.32 లక్షలు (70 శాతం) రాక

పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

పిల్లల చేరికలు పెంపు కోసం

ఇంటింటికీ ఉపాధ్యాయులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకాలు మారనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. తొమ్మిది, పది తరగతుల పుస్తకాలు మాత్రం మారవని పేర్కొన్నారు. ఆయన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ పుస్తకాలు మారనున్నందున ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామన్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం 16.2 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 11.32 లక్షలు (70 శాతం) జిల్లాకు చేరాయన్నారు. మిగిలిన పుస్తకాలు ఈవారం రానున్నాయని, మే ఒకటో తేదీ నుంచి అన్ని మండలాలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. రెండో వారం నుంచి మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ మొదలు పెడతామన్నారు. జూన్‌ 12న పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించేలా ప్రణాళిక రూపొందించామని, దీనిపై ఇప్పటికే మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్‌ స్కూళ్ల హెచ్‌ఎంలకు ఆదేశాలిచ్చామని తెలిపారు.

పాఠశాలలు తెరిచే నాటికి ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థుల కోసం రెడీనెస్‌ ప్రోగ్రామ్‌ కింద పుస్తకాలు సిద్ధం చేస్తున్నట్టు డీఈవో చెప్పారు. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ముందుటేడాది చదివిన పాఠ్యాంశాలపై పరీక్ష నిర్వహించేందుకు ఈ రెడీనెస్‌ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. దీని ప్రకారం బేస్‌ లైన్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలన్నదే విద్యా శాఖ ప్రధాన లక్ష్యమని ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి వెళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించామన్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను 100 శాతం ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు అంగీకారం తెలిపారన్నారు. ఎంఈవోలు, హెచ్‌ఎంలు ప్రతి మండలంలో ప్రచార రథాలు ఏర్పాటుచేసి విద్యార్థుల చేరికపై ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, అక్కడ చేపట్టిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీ రూపొందించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్లు, లేబొరేటరీలు, లైబ్రరీలు వంటి సదుపాయాలు ఉన్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరిస్తున్నామన్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరికలు తగ్గడానికి ఐదారు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఏటేటా తగ్గుతుండడం ఒక కారణమని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గ్రామాల నుంచి నగరాలకు వలసలు వెళ్లడం కూడా ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు.

జూన్‌ 12న పాఠశాలలు తెరిచేనాటికి పాఠశాలల భవనాలకు సంబంధించి చిన్నచిన్న మరమ్మతులు ఏమైనా ఉంటే పూర్తిచేస్తామన్నారు. పెండింగ్‌ పనుల పూర్తికి దాతల నుంచి సహాయం కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించిందని డీఈవో తెలిపారు. దీనికి దాతల నుంచి స్పందన వస్తోందన్నారు. దివీస్‌ లేబొరేటరీ సహాయంతో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానం పూర్తిస్థాయితో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 01:37 AM