Share News

186 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:57 AM

ఒడిశా నుంచి బూదరాళ్ల మీదుగా రాజమహేంద్రవరం, అనపర్తి, తమిళనాడుకు రవాణా చేస్తున్న 186 కిలోల గంజాయిని సోమవారం కొయ్యూరు, మంప పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.

186 కిలోల గంజాయి స్వాధీనం
వ్యాన్‌లో గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులతో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ, సిబ్బంది

వేర్వేరు చోట్ల పట్టుకున్న కొయ్యూరు, మంప పోలీసులు

నలుగురి అరెస్టు

కొయ్యూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి) ఒడిశా నుంచి బూదరాళ్ల మీదుగా రాజమహేంద్రవరం, అనపర్తి, తమిళనాడుకు రవాణా చేస్తున్న 186 కిలోల గంజాయిని సోమవారం కొయ్యూరు, మంప పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మకు అందిన ముందస్తు సమాచారం మేరకు చీడిపాలెం కూడలిలో తన సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. బూదరాళ్ల మీదుగా మినీ వ్యాన్‌లో వస్తూ పోలీసు తనిఖీలను గుర్తించి తిరిగి వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా ఆ వ్యాన్‌ను పట్టుకున్నారు. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వ్యాన్‌ను తనిఖీ చేశారు. వ్యాన్‌ బాడీ కింద రహస్య అర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో 83 ప్యాకెట్లలో 183 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన డ్రైవర్‌ వంతల ప్రసాద్‌తో పాటు తమిళనాడుకు చెందిన శంకర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. అలాగే మంప ఎస్‌ఐ శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం బూదరాళ్ల గ్రామ సరిహద్దుల్లో తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపగా వారు వాహనాన్ని వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా సుమారు మూడు కిలోల గంజాయి లభించింది. పట్టుబడిన అనపర్తి గ్రామానికి చెందిన జగరపు సాయికుమార్‌, పులిగ విజయ్‌కుమార్‌లను విచారించగా ధారకొండ అవతల ఒడిశాకు చెందిన గ్రామంలో కొనుగోలు చేశామని వారు తెలపడంతో ఇద్దర్నీ అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు.

Updated Date - Feb 17 , 2026 | 12:57 AM