Share News

18 నెలల గౌరవవేతనం పెండింగ్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:45 AM

మరో రెండు రోజుల్లో తమ పదవీ కాలం ముగుస్తుందని, 18 నెలల గౌరవవేతనం పెండింగ్‌లో వుందని, ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనానికి సంబంధించి నిధులు విడుదల చేయాలని జిల్లా పరిషత్‌ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు కోరారు.

18 నెలల గౌరవవేతనం పెండింగ్‌
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర. పక్కన సీఈవో నారాయణమూర్తి

ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి

జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల వినతి

గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నట్టు సీఈవో వెల్లడి

గౌరవ వేతన బకాయిల కోసం సమావేశంలో తీర్మానం

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మరో రెండు రోజుల్లో తమ పదవీ కాలం ముగుస్తుందని, 18 నెలల గౌరవవేతనం పెండింగ్‌లో వుందని, ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనానికి సంబంధించి నిధులు విడుదల చేయాలని జిల్లా పరిషత్‌ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు కోరారు. జిల్లా పరిషత్‌ పాలకవర్గం చివరి సమావేశం చైౖర్‌పర్సన్‌ సుభద్ర అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశం మందిరంలో జరిగింది. గౌరవ వేతనం బకాయిలపై చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న 18 నెలల గౌరవవేతనం కోసం పలు సమావేశాల్లో తీర్మానించి ప్రభుత్వానికి పంపామని, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ను కలిసి విన్నవించామన్నారు. జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి వివరణ ఇస్తూ.. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు గౌరవవేతన నిధులు ఎప్పటికప్పుడు విడుదలయ్యాయని, అంతకు ముందు 18 నెలల (వైసీపీ హయాంలో) బకాయిల కోసం ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. సమావేశంలో మరోసారి తీర్మానంచేస్తే పంపిస్తామని చెప్పగా.. సభ్యులు సమ్మతించి తీర్మానించారు.

పాడేరు ఆస్పత్రిలో సరిగా అందని వైద్య సేవలు

పాడేరులోని జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు సరిగా అందడంలేదని రోగులు ఫిర్యాదు చేస్తున్నారని, ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధికారులకు సూచించారు. సమావేశానికి అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య, ఆర్యోగ శాఖ అధికారి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పెదబయలు జడ్పీటీసీ సభ్యుడు బొంజిబాబు మాట్లాడుతూ, ఏజెన్సీలోని మండల కేంద్రాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉండడంలేదని, ఇటీవల పాడేరు ఆస్పత్రిలో ఒక మహిళ ప్రసవం అయిన తరువాత ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్‌ లేకపోవడంతో రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉండిపోయిందన్నారు. కె.కోటపాడు, దేవరాపల్లి, మునగపాక, ఎస్‌.రాయవరం, బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనురాధ, కర్రి సత్యం, పెంటకోట స్వామిసత్యనారాయణ, కాకర దేవి, దొండా రాంబాబు మాట్లాడుతూ, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతున్నదని చెప్పారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి బదులిస్తూ... తరచూ సదరం క్యాంపులు నిర్వహించి మెడికల్‌ బోర్డు తనిఖీల అనంతరం సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. జడ్పీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పలువురు అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:45 AM