17,82,800
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:17 AM
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది.
ఇదీ జిల్లా ఓటర్ల సంఖ్య
మహిళలదే పైచేయి
ముసాయిదా జాబితా విడుదల
పురుషులు 8,71,343 మంది, మహిళలు 9,11,348 మంది, ఇతరులు 109 మంది
‘సర్’ ప్రక్రియ తరువాత జాబితా నుంచి 2,40,209 మంది పేర్లు తొలగింపు
అత్యధికంగా గాజువాకలో 56,468 మంది పేర్లు తొలగింపు
ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా విడుదల
విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ‘సర్’లో భాగంగా వివిధ కారణాలతో 2,40,209 మంది పేర్లు తొలగించారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,23,009 నుంచి 17,82,800కు తగ్గింది. అయినా పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 8,71,343 మంది, మహిళా ఓటర్లు 9,11,348 మంది, ఇతరులు 109 మంది ఉన్నారు.
ఉద్యోగ రీత్యా జిల్లా 1,14,582 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు ‘సర్’లో గుర్తించారు. వారంతా ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకపోవడంతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారు. ఇంకా డూప్లికేట్, చనిపోయినవారు, తదితర కారణాలతో జాబితా నుంచి మొత్తం 2,40,209 మందిని తొలగించారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో 56,468 ఓట్లు, ఉత్తర నియోజకవర్గంలో 38,473, తూర్పులో 34,257, భీమిలిలో 31,536, పశ్చిమలో 30,556, పెందుర్తిలో 26,008, ‘సౌత్’లో 22,911 ఓట్లు తొలగించారు. తాజాగా విడుదల చేసిన ముస్తాయిదా జాబితా ప్రకారం భీమిలి నియోజకవర్గంలో అత్యధికంగా 3,35,950 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా విశాఖ పశ్చిమలో 1,83,334 మంది ఉన్నారు. ఇంకా తూర్పు నియోజకవర్గంలో 2,57,970 మంది, దక్షిణ నియోజకవర్గంలో 1,94,884 మంది, ఉత్తరం నియోజకవర్గంలో 2,45,868 మంది, గాజువాకలో 2,78,300 మంది, పెందుర్తిలో 2,86,494 మంది ఉన్నారు.
జిల్లాలో పోలింగ్ బూత్‌ల సంఖ్య 1,980 నుంచి 2,143కు పెరిగింది. భీమిలి నియోజకవర్గంలో గతంలో 361 ఉండగా, ఇప్పుడు 400 పోలింగ్ బూత్‌లు అయ్యాయి. తూర్పులో 282 నుంచి 285కు, దక్షిణంలో 236కి 248కు, ఉత్తరంలో 272 నుంచి 293కు, పశ్చిమలో 221 నుంచి 237కు, గాజువాకలో 309 నుంచి 339కు, పెందుర్తిలో 299 నుంచి 341కు పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచారు. కాగా సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసిన వారిలో 27,555 మంది ఓటర్లు ఇంతవరకు మ్యాపింగ్ కాలేదు. ఇంకా 2,23,23 మంది ఓటర్లు సమర్పించిన ఫారాల్లో పలు తప్పులు ఉన్నట్టు గుర్తించారు. మ్యాపింగ్ కానివారు, తప్పులు నమోదుచేసిన ఓటర్లకు నోటీసులు జారీచేస్తారు. వీరంతా ఆగస్టు 30లోగా తగిన డాక్యుమెంట్లను సంబంఽధిత బీఎల్‌వో, వీఆర్వోలకు సమర్పించాలి. లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను శుక్రవారం నుంచి ఆగస్టు 30వ తేదీలోగా సమర్పించవచ్చు. ఓటర్ల జాబితా పేర్లు లేని వారు ఫారం-6 సమర్పించినట్టయితే పేరు చేరుస్తారు. తుది ఓటర్ల జాబితా అక్టోబరు మూడో తేదీన విడుదల చేస్తారు.
ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు...నియోజకవర్గాల వారీగా
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు పోలింగ్ బూత్‌లు
1. భీమిలి 1,64,056 171880 14 3,35,950 400
2. విశాఖ తూర్పు 1,24,606 1,33,345 19 2,57,970 285
3. విశాఖ దక్షిణ 94,807 1,00,047 30 1,94,884 248
4. విశాఖ ఉత్తరం 1,20,011 1,25,834 23 2,45,868 293
5. విశాఖ పశ్చిమ 88,946 94,378 10 1,83,334 237
6. గాజువాక 1,37,751 1,40,540 9 2,78,300 339
7. పెందుర్తి 1,41,166 1,45,324 4 2,86,494 341
మొత్తం 8,71,343 9,11,348 109 17,82,800 2,143