Share News

150 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:51 AM

అనకాపల్లి జిల్లా పోలీసులు వేర్వేరు ప్రదేశాల్లో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని పట్టుకొన్నారు. కె.కోటపాడు పోలీసులు మండల కేంద్రానికి సమీపంలో కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పోలీసులు జాతీయ రహదారిపై పల్లావూరు కూడలి వద్ద 50 కిలోల గంజాయితో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా గమ్యస్థానాలకు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు.

 150 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, తదితరులు

తొమ్మిది మంది అరెస్టు

అనకాపల్లి జిల్లా పోలీసులు వేర్వేరు ప్రదేశాల్లో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని పట్టుకొన్నారు. కె.కోటపాడు పోలీసులు మండల కేంద్రానికి సమీపంలో కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పోలీసులు జాతీయ రహదారిపై పల్లావూరు కూడలి వద్ద 50 కిలోల గంజాయితో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా గమ్యస్థానాలకు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు.

-------

కె.కోటపాడులో 100 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 100 కిలోల గంజాయిని కె.కోటపాడు పోలీసులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారని డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్పెషల్‌ బ్రాంచి అధికారులు అందించిన సమాచారం మేరకు కె.కోటపాడు ఎస్‌ఐ ధనుంజయ్‌, సిబ్బంది బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారన్నారు. సాయంత్రం కోటపాడు సమీపంలోని చల్లవారి కళ్లాల ప్రాంతంలో ఒక కారును తనిఖీ చేయగా అందులో 100 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. కారులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్దుల్‌ హకీమ్‌, సయ్యద్‌ సమీర్‌ ఆలీలను అరెస్టు చేశామని చెప్పారు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు, వాహన రికార్డులను స్వాధీనం చేసుకొని సెక్షన్‌ 50 ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారన్నారు. నిందితులు హైదరాబాద్‌ నుంచి ఒడిశా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి గంజాయిని లోడు చేసుకొని తిరిగి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టు కావాల్సి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సీఐ అప్పలరాజు, ఎస్‌ఐ ధనుంజయ్‌ పాల్గొన్నారు.

కృష్ణాదేవిపేట వద్ద 50 కిలోల గంజాయితో ఏడుగురి అరెస్టు

నర్సీపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం పల్లావూరు వద్ద జాతీయ రహదారి జంక్షన్‌లో 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఏడుగురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నర్సీపట్నం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గొలుగొండ మండలం మీదుగా గంజాయి రవాణా అవుతున్నట్టు కృష్ణాదేవిపేట పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్‌ఐ వి.రుషికేశ్వరరావు, సిబ్బంది కలిసి గురువారం ఉదయం జాతీయ రహదారిపై పల్లావూరు కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కొద్దిసేపటి తరువాత ఏజెన్సీ వైపు నుంచి వరుసగా వస్తున్న కారు, మూడు ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేశారు. కారు డిక్కీలో రెండు బస్తాల్లో ప్యాకింగ్‌ చేసిన 50 కిలోల గంజాయి లభ్యమైంది. కారులో వున్న కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన గంటిమళ్ల రాజకుమార్‌, తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా పెద్దతల్లాపల్లి గ్రామానికి చెందిన అభినేశ్‌ మునియప్పన్‌, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మెరిపో కిశోర్‌, అతని భార్య లావణ్య, ద్విచక్ర వాహనాలపై కారుకు ముందు, వెనుక పైలట్‌లుగా వస్తున్న తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన గంటిమల్ల లోవరాజు, సంతపైడిపాడు గ్రామానికి చెందిన చెన్నాడ ప్రవీణ్‌కుమార్‌, నందమూరు గ్రామానికి చెందిన మెరిపో విజయ్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాజకుమార్‌ మీద హత్యాయత్నం, గంజాయి రవాణా, దొంగతనాలు, నాటుసారా, పోలీసుల మీద దాడికి సంబంధించి మొత్తం 14 కేసులు వున్నాయి. ఇతనిపై రౌడీ షీటు కూడా వుంది. వీరు ఒడిశా రాష్ట్రం చిత్రకొండ సమీపంలోని జుడుంబా గ్రామంలో 50 కిలోల గంజాయిని కిలో రూ.10 వేల చొప్పున కొనుగోలు చేశారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారు, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. మీడియా సమావేశంలో రూరల్‌ సీఐ రేవతమ్మ, ఎస్‌ఐలు వి.రుషికేశ్వరరావు, రాజారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:51 AM