Share News

ఏటా 15% ఆర్థిక వృద్ధి

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:34 AM

స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా ఏటా 15 శాతం కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి సాధించడంపై దృష్టి పెట్టినట్టు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు.

ఏటా 15% ఆర్థిక వృద్ధి

  • ఇదీ విజన్‌-2047 లక్ష్యం

  • విశాఖ జిల్లాను రూ.23.6 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

  • రోజుకు 2.44 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం

  • త్వరలో టీసీఎస్‌ కార్యకలాపాలు

  • ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రూ.279 కోట్లతో 1.6 లక్షల మందికి చికిత్స

  • 6,807 మహిళా సంఘాలకు రూ.36.37 కోట్ల రుణాలు

  • మే నాటికి నాలుగు మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు పూర్తి

  • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా ఏటా 15 శాతం కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి సాధించడంపై దృష్టి పెట్టినట్టు జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. 2047 నాటికి జిల్లాను రూ.23.6 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా తలసరి ఆదాయం రూ.40 లక్షలకు చేరుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజనల్‌ యాక్షన్‌ ప్లాన్‌లు రూపొందించినట్టు వెల్లడించారు. సోమవారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం ఇచ్చారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శాఖల వారీగా పురోగతిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందన్నారు.

తల్లికి వందనం పథకం కింద 2.9 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.436 కోట్లు, దీపం కింద 3.73 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.87.7 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద ప్రతి నెలా 1.6 లక్షల మంది పింఛనదారులకు రూ.70 కోట్లు అందిస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,750 మంది రైతులకు రూ.11.45 కోట్లు అందించామన్నారు. ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకూ రూ.100 కోట్ల మేర లబ్ధి పొందారన్నారు. సగటున రోజుకు 2.44 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. ఏపీఐఐసీ ద్వారా 16 ఐటీ కంపెనీలకు భూములు కేటాయించామని, వారంతా రూ.10,600 కోట్ల పెట్టుబడితో 1.1 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారన్నారు. ‘కాగ్నిజెంట్‌’ సంస్థ రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నదన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌కు మిలినీయం టవర్స్‌లో రెండు లక్షల చ.అ. వర్కింగ్‌ స్థలం కేటాయించామని, త్వరలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నదని వెల్లడించారు.

2025లో ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకం కింద 1.6 లక్షల మందికి రూ.279 కోట్ల విలువైన చికిత్స అందించినట్టు చెప్పారు. గత ఏడాది జనవరి నుంచి 108 అంబులెన్స్‌ల ద్వారా 36 వేల మందికి, 104 వాహనాల ద్వారా 1.5 లక్షల మందికి వైద్యసేవలు అందించామన్నారు. రైతుసేవా కేంద్రాల నుంచి రబీ సీజన్‌కు 83 క్వింటాళ్ల విత్తనాలు అందజేశామన్నారు. కాయగూరలు, పండ్లు నిల్వ కోసం రెండు ప్యాక్‌ హౌస్‌లు, రెండు కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఒక క్రాప్‌ డయ్యర్‌ మంజూరుచేశామన్నారు. మత్స్య సంపద పెంచడానికి సముద్రంలో 10 ఆర్టిఫీషియల్‌ రీఫ్‌లు ఏర్పాటుచేశామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 34,700 మందికి 13 లక్షల పనిదినాలు కల్పించి రూ.36 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. రూ.89 లక్షలతో 150 ఎకరాల్లో పండ్ల తోటలు పెంపకం చేట్టామన్నారు. నరేగా కింద గత ఏడాది 27 కిలోమీటర్ల పొడవైన 168 రోడ్ల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరుచేశామన్నారు. పల్లె పండుగ కింద రూ.16 కోట్లతో 144 సీసీ, బీటీ రోడ్లు నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వెలుగు పథకంలో 1,371 స్వయంశక్తి సంఘాలకు రూ.165 కోట్లు, స్త్రీనిధి ద్వారా 6,807 సంఘాలకు రూ.36.37 కోట్లు రుణాలుగా మంజూరుచేశామన్నారు. జలజీవన్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో రూ.62 కోట్లతో చేపట్టిన 290 పనులు పురోగతిలో ఉన్నాయని, 40 వేల ఇళ్లకు కొళాయిలు వేశామన్నారు. గతిశక్తి పథకం కింద రూ.26 కోట్లతో చేపట్టిన వాల్తేరు మార్షలింగ్‌ యార్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో ఆప్షన్‌-3 కింద 1.15 లక్షల ఇళ్లకుగాను 32,856 ఇళ్లు, గ్రామీణ మండలాల్లో 27,952కి 20,731 ఇళ్లు పూర్తిచేశామన్నారు.

పీఎం సూర్యఘర్‌ పథకంలో ఇంతవరకూ జిల్లాలో 14 వేల దరఖాస్తులు రాగా వాటిలో ఐదు వేల ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానళ్లు అమర్చి గ్రిడ్‌కు అనుసంధానం చేశామని కలెక్టర్‌ వివరించారు. భీమిలి సమీపాన గల రాజుల తాళ్లవలసను మోడల్‌ సోలార్‌ గ్రామంగా ఎంపిక చేశామన్నారు. జిల్లాలో నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్‌ అందించడానికి సుమారు రూ.682 కోట్లతో రెండు 220 కేవీ, ఐదు 132 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. రూ.43.3 కోట్లతో 35 ఎంఎస్‌ఎంఈలు, రూ.16,219 కోట్లతో మూడు భారీ పరిశ్రమలు ఉత్పాదనలోకి రాబోతున్నాయని ప్రకటించారు. గత ఏడాది నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 18 ఒప్పందాలు, రూ.ఆరు వేల కోట్ల పెట్టుబడుల ద్వారా 14 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణకు జీవో 30 కింద 10,642 దరఖాస్తులు రాగా పరిశీలన చేస్తున్నామని, జీవో 296 కింద తొలిదశలో 17,183 పట్టాలకు కన్వేయన్స్‌ డీడ్లు అమలు చేశామన్నారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 85 గ్రామాలకుగాను 53 గ్రామాల్లో రీసర్వే పూర్తిచేశామని, 36 గ్రామాల్లో 14,432 మంది రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో 15 మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో 13 రోడ్లకు డీపీఆర్‌లు తయారుచేయగా తొలిదశలో నాలుగు రోడ్లు ఈ ఏడాది మే నెలకల్లా విస్తరిస్తామని ప్రకటించారు. నగరంలో 50 అంతస్థుల ఐకానిక్‌ ప్రీమియం హౌసింగ్‌ అపార్టుమెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాంప్లెక్స్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో భాగంగా విశాఖ-భీమిలి-భోగాపురాన్ని కలుపుతూ బే సిటీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ రోడ్ల అనుసంధానం కోసం రూ.70 కోట్లతో 15.7 కి.మీ. రోడ్లు కు ప్రతిపాదించామన్నారు. నగరంలో మూడుచోట్ల రూ.170 కోట్లతో వర్కింగ్‌ వుమెన్‌ హాస్టళ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని 25 అన్న క్యాంటీన్లలో సగటున రోజుకు 24,700 మంది భోజనం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధుల మంజూరుతోపాటు నిరంతరం సహకారం అందిస్తున్న సీఎం నారా చంద్రబాబునాయుడు, ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ప్రజా ప్రతినిధులు, న్యాయాధికారులకు, పోలీసులకు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సమగ్ర, సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు అందరి సహకారం కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. 446 మంది ప్రశంసాపత్రాలు అందజేశారు. పలు శాఖలకు సంబంధించి 13,113 మందికి రూ.809.15 కోట్ల విలువైన వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, జేసీ జి.విద్యాధరి, డీసీపీలు మణికంఠ, మేరీ ప్రశాంతి, ఎమ్మెల్యేలు పి.గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:34 AM