140 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:56 AM
ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అనకాపల్లి జిల్లా మీదుగా రాజస్థాన్ రాష్ట్రానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా పట్టుకున్న కశింకోట పోలీసులు
కంటైనర్ లారీ డ్రైవర్‌తోపాటు మరో మైనర్ అరెస్టు
అనకాపల్లి రూరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అనకాపల్లి జిల్లా మీదుగా రాజస్థాన్ రాష్ట్రానికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
ఒడిశా నుంచి కంటైనర్ లారీలో గంజాయిని లోడింగ్ చేసి, అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారి మీదుగా రవాణా చేస్తున్నట్టు కశింకోట పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ ఎ.స్వామినాయుడు, పోలీసు సిబ్బంది, ఈగల్ టీమ్ సంయుక్తంగా గురువారం సాయంత్రం కశింకోటలో హైవేపై స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ.. తనిఖీ చేస్తున్న పోలీసులకు కొద్ది దూరంలో ఆగింది. వెంటనే అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఒకరు డ్రైవర్ సద్దాం హుస్సేన్ కాగా మరొకరు మైనర్ (17 ఏళ్లు). అనంతరం కంటైనర్ లారీలో తనిఖీ చేయగా, క్యాబిన్లో రహస్యంగా ఏర్పాటు చేసిన అరలో 28 ప్యాకెట్ల గంజాయి లభించింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేసి 140 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. అనంతరం డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్‌ను జువెనైల్ హోమ్‌కు పంపారు. రాజస్థాన్‌కు చెందిన కిషన్ అనే గంజాయి వ్యాపారి ఆదేశాల మేరకు వీరు ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. మీడియా సమావేశంలో ఏఎస్పీ ఎల్.మోహనరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.