1,34,271
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:00 AM
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని సోమవారం 1,34,271 మంది భక్తులు దర్శించుకున్నారని దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.
ఇదీ అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య
అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల వరకూ అవకాశం
సింహాచల దేవస్థానం ఈఓ జె.వెంకటరావు
అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం
సింహాచలం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని సోమవారం 1,34,271 మంది భక్తులు దర్శించుకున్నారని దేవస్థానం ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఆయన ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం క్యూలో ప్రవేశించిన భక్తులందరికీ దర్శనం కల్పించామన్నారు. అధికారులు నిరంతరం క్యూలైన్లను పర్యవేక్షించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. సింహగిరికి భక్తులను చేరవేసేందుకు 90 బస్సులను వినియోగించామన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 1,39,000 లీటర్ల తాగునీటిని అందుబాటులో ఉంచగా, 1,24,410 లీటర్ల నీటిని భక్తులు వినియోగించుకున్నట్టు ఆయన చెప్పారు. ఉత్సవ సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 23 ఫిర్యాదులు నమోదుకాగా సిబ్బంది సకాలంలో స్పందించి వాటిని సత్వరమే పరిష్కరించినట్టు ఈఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో చందనోత్సవం విజయవంతమైందంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా సహనంతో క్రమశిక్షణతో భక్తులంతా సహకరించారని పేర్కొన్నారు.
అప్పన్న ఒలుపు చందనం 121 కిలోలు
వరాహ లక్ష్మీనృసింహస్వామి పైపూతగా ఉన్న చందనాన్ని నిజరూప దర్శనం కోసం ఏప్రిల్ 20న ఆలయ వైదికులు సంప్రదాయబద్ధంగా ఒలిచారు. ఆ విధంగా తీసిన చందనం 121 కిలోల ఉన్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వెంకటరావు వెల్లడించారు. ఏడాది పొడవునా అప్పన్న పైపూతగా ఉండే చందనాన్ని భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. అంతటి విలువైనది కావడంతో ఒలుపు చందనాన్ని ప్యాకెట్లుగా తయారుచేసి త్వరలో సింహగిరిపై ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయించనున్నట్టు ఏఈఓ ప్రకటించారు. చందనం ప్యాకెట్ ధర, దాని బరువు వంటి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.