గ్రేటర్‌లో 120 వార్డులు
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:29 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగనున్నది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ జారీచేసింది. రెండు లక్షలలోపు జనాభా ఉండే నగర పంచాయతీలు, మునిసిపాలీటీల్లో 60 వార్డులు ఉండాలని, 15 లక్షలకు పైబడి జనాభా ఉన్న కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య 120 ఉండాలని స్పష్టంచేసింది. దీనిని బట్టి 20 లక్షలకు పైబడిన జనాభా ఉన్న జీవీఎంసీలో వార్డుల సంఖ్య 120కి పెరగనుంది.
జనాభా ఆధారంగా వార్డుల సంఖ్య నిర్ణయం
జనాభా రెండు లక్షలలోపు ఉంటే 60 వార్డులు
అదే 15 లక్షలు దాటితే 120 వార్డులు
గెజిట్ జారీచేసిన ప్రభుత్వం
ఒకవేళ జీవీఎంసీ పరిధి విస్తరిస్తే
గెజిట్ నుంచి మినహాయింపు
అప్పుడు వార్డులు మరింత పెరిగే అవకాశం
విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్య 98 నుంచి 120కి పెరగనున్నది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ జారీచేసింది. రెండు లక్షలలోపు జనాభా ఉండే నగర పంచాయతీలు, మునిసిపాలీటీల్లో 60 వార్డులు ఉండాలని, 15 లక్షలకు పైబడి జనాభా ఉన్న కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య 120 ఉండాలని స్పష్టంచేసింది. దీనిని బట్టి 20 లక్షలకు పైబడిన జనాభా ఉన్న జీవీఎంసీలో వార్డుల సంఖ్య 120కి పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని గ్రాంట్లను పొందాలంటే స్థానిక సంస్థల్లో ఎన్నికైనా కార్యవర్గం ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల (నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు) కార్యవర్గాల పదవీకాలం ఈనెల 17తో ముగిసింది. తిరిగి ఎన్నికలు జరపాలంటే రిజర్వేషన్‌లు ఖరారు చేయాలి. ప్రస్తుతం కులగణన జరుగుతుండడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి ఏర్పడింది. రెండు, మూడు నెలల్లో కులగణన, రిజర్వేషన్లు ఖరారు పూర్తయితే వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను ఖరారు చేయాలని కోరుతూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ పి.సంపత్‌కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. పదిహేను లక్షలకు పైబడి జనాభా ఉంటే 120 వార్డులు ఉండేలా సీడీఎంఏ చేసిన ప్రతిపాదనను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ జారీచేసింది. రాష్ట్రంలో 15 లక్షలకు పైబడి జనాభా కలిగివున్న మునిసిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ ఒక్కటే. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులు ఇకపై 120కి పెరుగుతాయి.
తదుపరి ఉత్తర్వులు వస్తే కొత్తవార్డుల సరిహద్దులు గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థల్లో ఉండాల్సిన వార్డుల సంఖ్యను నిర్ణయిస్తూ గెజిట్ జారీచేయడంతో వార్డుల సంఖ్య ఎంతనే దానిపై ఒక స్పష్టత వచ్చినట్టయింది. అయితే గెజిట్‌లో పేర్కొన్న వార్డుల సంఖ్యకు అనుగుణంగా సరిహద్దులను నిర్ణయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవీఎంసీని ఆదేశిస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుంది. దీనిపై ఉత్తర్వులు వస్తే టౌన్‌ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీ మొత్తం జనాభాను 120 వార్డులకు సమానంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వార్డు సరిహద్దు నిర్ణయించేటప్పుడు భౌగోళిక సౌలభ్యం కోసం జనాభా సంఖ్యను పది శాతం అటుఇటుగా నిర్ణయించే వెసులుబాటు ఉంటుంది. 120 వార్డుల సరిహద్దులు నిర్ణయించిన తర్వాత వార్డుల స్వరూపంపై జీవీఎంసీ ప్రతి జోనల్ కార్యాలయంలో జాబితాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరణకు గడువు ఇచ్చి, వాటిని పరిష్కరించడం లేదా నివృత్తి చేసిన తర్వాత వార్డు సరిహద్దులతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షెడ్యూల్ జారీచేస్తే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోతుంది.
జీవీఎంసీ పరిధి పెంచితే...
ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌లో ఎంత జనాభాకు ఎన్ని వార్డులు ఉండాలని స్పష్టంగా తెలియజేసింది. ఒకవేళ పట్టణ స్థానిక సంస్థల పరిధి విస్తరించినట్టయితే వార్డుల సంఖ్య మినహాయింపు ఉంటుందని పేర్కొనడంతో జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యపై స్పష్టత కరువైంది. జీవీఎంసీలో భీమిలి, పెందుర్తి మండలాల్లోని మిగిలిన గ్రామాలతోపాటు, ఆనందపురం, పద్మనాభం మండలాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఆ నాలుగు మండలాలను విలీనం చేస్తే జిల్లా మొత్తం జీవీఎంసీ పరిధిలోనే ఉంటుందని ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఒకవేళ విలీనానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్య 120 కాకుండా మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ విలీనం జరగకపోతే మాత్రం 120 వార్డులతోనే ఎన్నికకు సిద్ధం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.