మహిళలకు 118 పంచాయతీలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:27 PM
జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్‌ను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి విడుదల చేశారు.
జిల్లాలో మొత్తం 244 పంచాయతీలు
ఎస్టీ మహిళలు: 117, అన్‌రిజర్వుడు మహిళ: 1
ఎస్టీ జనరల్: 124
అన్‌రిజర్వుడు జనరల్: 2
మొత్తం 2,446 వార్డుల్లో
1,223 మహిళలకు కేటాయింపు
సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్
గెజిట్ విడుదల చేసిన కలెక్టర్ నిషాంతి
పాడేరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్‌ను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి విడుదల చేశారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 2,446 పోలింగ్ కేంద్రాలున్నాయి. మొత్తం 244 గ్రామ పంచాయతీలకు గానూ 117 ఎస్టీ మహిళలకు, 124 ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. అనంతగిరి మండలంలోని నాన్ షెడ్యూల్డ్ ప్రాంతంలోని భీంపోలు పంచాయతీ, గరుడుబిల్లి పంచాయతీలను అన్రిజర్వుడుకు, రొంపిల్లి పంచాయతీని అన్‌రిజర్వుడు మహిళకు కేటాయించారు. జిల్లాలో మొత్తం 2,446 వార్డులకుగానూ 1,086 ఎస్టీ మహిళలకు, 1162 ఎస్టీ జనరల్, 137 అన్‌రిజర్వుడు మహిళలకు, 61 అన్‌రిజర్వుడు జనరల్‌కు కేటాయించారు. ఎన్నికల నిబంధనల మేరకు మొత్తం 2,446 వార్డుల్లో సగం అంటే 1,223 వార్డులను మహిళలకు కేటాయించారు.
ఊపందుకోనున్న అభ్యర్థుల ఎంపిక
గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జోరందుకుంటుంది. ఇప్పటికే కొంతమేరకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్నప్పటికీ, రిజర్వేషన్లు తారుమారైతే ఇబ్బందులు ఏర్పడతాయని అందరూ వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయడంతో రిజర్వేషన్ల ఆధారంగా తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమవుతారు. ఇక నుంచి గ్రామాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కి ఎన్నికల హడావిడి నెలకొంటుంది.