Share News

11 పంచాయతీలు ఏకగ్రీవం

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:35 AM

జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో గల 79 పంచాయతీల్లో 11 ఏకగ్రీవం అయ్యాయి.

11 పంచాయతీలు ఏకగ్రీవం

మరో మూడు పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు కూడా...

65 సర్పంచ్‌ పదవులకు 160 మంది పోటీ

559 వార్డులకు 1,230 మంది..

ముగిసిన నామినేషన్ల ఘట్టం

2న పోలింగ్‌

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో గల 79 పంచాయతీల్లో 11 ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు పంచాయతీల్లో సర్పంచులు మాత్రమే ఏకగ్రీవం కాగా అక్కడ వార్డు పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 65 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు 160 మంది పోటీలో ఉన్నారు.

జిల్లాలో 79 గ్రామ పంచాయతీలకు డిసెంబరు రెండో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసేసరికి 11 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులు మొత్తం ఏకగ్రీవమయ్యాయి. 11 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులకు ఒక్కొక్కరే పోటీలో ఉండడంతో వారంతా ఏకగ్రీవం అయినట్టు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు.

ఆనందపురం మండలం పందలపాక, గొట్టిపల్లి, కుసులువాడ, ముకుందపురం, శిర్లపాలెం, బోని, పద్మనాభం మండలం బీఆర్‌ తాళ్లవలస, శేరిఖండం, రెడ్డిపల్లి, భీమిలి మండలం లక్ష్మీపురం, పెందుర్తి మండలం ఎస్‌.ఆర్‌.పురం పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఆనందపురం మండలంలో ఆనందపురం, గంభీరం, పద్మనాభం మండలంలో పాండ్రంకి పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు మాత్రమే ఏకగీవ్రమయ్యాయి. పాండ్రంకిలో 14 వార్డులు ఉండగా పది ఏకగ్రీవం కాగా నాలుగింటికి, గంభీరం, ఆనందపురం పంచాయతీల్లో అన్ని వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. నాలుగు మండలాల్లో మిగిలిన 65 సర్పంచ్‌ పదవులకు 160 మంది బరిలో ఉన్నారు. ఆనందపురం మండలంలో 18 సర్పంచ్‌ పదవులకు 53 మంది, భీమిలి మండలంలో 15 సర్పంచ్‌ పదవులకు 31 మంది, పద్మనాభం మండలంలో 18 సర్పంచ్‌ పదవులకు 41 మంది, పెందుర్తిలో 14 సర్పంచ్‌ పదవులకు 35 మంది పోటీచేస్తున్నారు. వార్డులకు సంబంధించి భీమిలి మండలంలో 166 వార్డులు ఉండగా 37 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 129 వార్డులకు 299 మంది పోటీలో ఉన్నారు. పద్మనాభం మండలంలో 226 వార్డులు ఉండగా 74 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 152 వార్డులకు 336 మంది పోటీలో ఉన్నారు. పెందుర్తి మండలంలో 150 వార్డులు ఉండగా 37 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 113 వార్డులకు 256మంది పోటీ చేస్తున్నారు.

ఆనందపురం మండలంలో 260 వార్డులకుగాను 95 వార్డులు ఏకగ్రీవం అయ్యీయి. మిగిలిన 165 వార్డులకు 365 మంది పోటీలో ఉన్నారు. కాగా నాలుగు మండలాల పరిధిలో 11 సర్పంచ్‌ పదవులు, 243 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటిలో మూడుచోట్ల సర్పంచ్‌ పదవులు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని జిల్లా పంచాయతీ అఽదికారి ఎంవీఎన్‌ శ్రీనివాసరావు తెలిపారు. కాగా 65 పంచాయతీలలో సర్పంచ్‌ పదవులకు 160 మంది, 559 వార్డులకు 1,230 మంది పోటీలో ఉన్నారని పేర్కొన్నారు.


అత్యధిక చోట్ల టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవం

విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత 14 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో పదమూడుచోట్ల కూటమి (తెలుగుదేశం 12, జనసేన 1) బలపరచినవారు ఎన్నిక కాగా, ఒకటి వైసీపీకి దక్కింది.

తెలుగుదేశం మద్దతుదారులు ఎన్నికైన పంచాయతీలు: ఆనందపురం మండలం ఆనందపురం (మీసాల పైడిరాజు), గంభీరం (వానపల్లి ముత్యాలరావు), శిర్లపాలెం, బోని (సురాల సత్యవరప్రసాద్‌), గొట్టిపల్లి (ఇంపిల్లి మహేష్‌), ముకుందపురం, పందలపాక (గోవింద్‌), పద్మనాభం మండలం పాండ్రంకి (రామరాజు) రెడ్డిపల్లి (సుంకరి అప్పలరాజు), శేరిఖండం (వాడపల్లి రేణుక), బీఆర్‌ తాళ్లవలస (చందక గౌతమి), భీమిలి మండలం లక్ష్మిపురం (బోని పైడిరాజు)

జనసేన: పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌.పురం (గొల్లిపల్లి దివాకర్‌)

వైసీపీ: ఆనందపురం మండలం కుసులువాడ (శినగం దామోదరరావు)


గంభీరంలో సర్పంచ్‌ అభ్యర్థి తడబాటు

రెండింటిలో ఒక నామినేషన్‌ ఉపసంహరణ

ఆటోమేటిగ్గా రెండో సెట్‌ కూడా

విత్‌డ్రా చేసుకున్నట్టేనని చెబుతున్న ఎన్నికల నిబంధనలు

దాంతో టీడీపీ మద్దతుదారుడు వానపల్లి ముత్యాలరావు ఏకగ్రీవం

విశాఖపట్నం/ఆనందపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

అవగాహన లేమి ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన బోయ వెంకటరమణ కొంపముంచింది. సర్పంచ్‌ పదవికి బోయ వెంకటరమణ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన సందర్భంగా రెండు సెట్లు సక్రమంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే శుక్రవారం రెండు సెట్లలో ఒక దానిని ఉపసంహరించుకున్నట్టు బోయ వెంకటరమణ గంభీరం రిటర్నింగ్‌ అధికారిని కలిసి రాతపూర్వకంగా పత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల నిబంధనల మేరకు సర్పంచ్‌/వార్డు సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువగా దాఖలు చేసిన నామినేషన్లు అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ వాటిలో ఒకటి మినహా మిగతావి ఉపసంహరించుకుంటే మొత్తం అన్నీ ఉపసంహరించుకున్నట్టు గుర్తిస్తారు. ఈ విషయంపై అవగాహన లేని వెంకటరమణ తాను దాఖలు చేసిన రెండు సెట్లలో ఒకటి ఉపసంహరించుకోవడంతో రెండో సెట్‌ కూడా విత్‌డ్రా కింద పరిగణించారు. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలగినట్టు ఆర్వో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ అభ్యర్థిగా టీడీపీ మద్దతుదారుడు వానపల్లి ముత్యాలరావు ఒక్కరే బరిలో ఉన్నారు. దాంతో సర్పంచ్‌గా ముత్యాలరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బోయ వెంకటరమణ మద్దతుదారులు వెల్లంకి టీఎస్సార్‌ కల్యాణ మండలంలో నామినేషన్ల కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కాగా ప్రత్యర్థితో ఆర్వో కుమ్మక్కైయ్యారని వెంకటరమణ మద్దతుదారులు ఆరోపించారు. సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తి ఒక సెట్‌ నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటామని వచ్చినప్పుడు రెండో సెట్‌ కూడా ఉపసంహరించుకున్నట్టేననే విషయం ఆర్వో చెప్పలేదని దీని వెనుక కుట్ర జరిగిందని ఆరోపించారు.

Updated Date - Nov 28 , 2026 | 01:35 AM