Share News

నేటి నుంచి పది పరీక్షలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:33 AM

పదో తరగతి పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

నేటి నుంచి పది పరీక్షలు

జిల్లాలో 133 కేంద్రాలు, 28,983 మంది విద్యార్థులు

ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలు

అరగంట ముందు నుంచి కేంద్రాల్లోకి అనుమతి

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

పదో తరగతి పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి జిల్లాలోని 133 కేంద్రాల్లో ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 456 పాఠశాలలకు చెందిన 28,983 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 15,292 మంది బాలురు, 13,691 మంది బాలికలు ఉన్నారు. ఫిజికల్‌ సైన్స్‌, నేచురల్‌ సైన్స్‌ మినహా మిగిలిన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్‌ సైన్స్‌, నేచురల్‌ సైన్స్‌ పరీక్షలు (25, 28 తేదీల్లో) ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఫస్టు లాంగ్వేజ్‌లో కాంపోజిట్‌ తెలుగు విద్యార్థులకు తొలి రోజు తెలుగు పరీక్ష 70 మార్కులు, తరువాత ఈ నెల 31వ తేదీన 42 కేంద్రాల్లో 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒకేషనల్‌ కోర్సు చదివే నాలుగు వేల మంది విద్యార్థులకు ఈ నెల 31వ తేదీన జిల్లాలోని 62 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పది గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ విద్యార్థి ఎవరైనా రోజూ ఆలస్యంగా వస్తుంటే అతని కదలికలపై నిఘా ఉంచుతారు. ప్రతి కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌ను పర్యవేక్షణ నిమిత్తం నియమించారు. మొత్తం 1,634 మంది ఇన్విజిలేటర్లను నియమించగా, వీరిలో 20 శాతం మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినట్టు డీఈవో ప్రేమ్‌కుమార్‌ వెల్లడించారు. పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రైవేటు పాఠశాలల్లో ఉండే సీసీ కెమెరాలు నిలుపుదల చేయాలని స్పష్టంచేశారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 260 మంది ఉండగా, వారికి స్కైబ్స్‌ను ఏర్పాటు చేయించారు. అన్ని కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఎండతీవ్రత నేపథ్యంలో విద్యార్థులకు తాగునీటిని అందుబాటులో వుంచుతారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Mar 16 , 2026 | 01:33 AM