Share News

నేటి నుంచి టెన్త్‌ మూల్యాంకనం

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:45 AM

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జ్ఞానాపురంలోని జూబ్లీ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో సోమవారం ప్రారంభం కానుంది.

నేటి నుంచి టెన్త్‌ మూల్యాంకనం

జ్ఞానాపురం జూబ్లీ పాఠశాలలో ఏర్పాట్లు

జిల్లాకు చేరిన 1.73 లక్షల జవాబుపత్రాలు

విధుల్లో 800 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది

జవాబుపత్రాల స్కానింగ్‌కు 250 ట్యాబులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి):

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జ్ఞానాపురంలోని జూబ్లీ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో సోమవారం ప్రారంభం కానుంది. పదిరోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి చేరిన 1.73 లక్షల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారు. మొత్తం ఏడు సబ్జెకులకు గాను ఎక్కువగా ఫిజికల్‌ సైన్స్‌ జవాబుపత్రాలు వచ్చాయి. మూల్యాంకనంలో అన్ని కేడర్లు కలిపి 800 మంది వరకు అధికారులు, ఉపాధ్యాయులు విధులు నిర్వహించనున్నారు.

ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూల్యాంకనం జరగనుంది. ఈ ఏడాది తొలిసారిగా జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసిన తరువాత మూల్యాంకనం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. స్కానింగ్‌ కోసం సుమారు 250 ట్యాబ్‌లు సమకూర్చారు. అదనంగా మరో 50 ట్యాబులు అందుబాటులో ఉంచారు. ట్యాబులు మరమ్మతులు చేయడానికి శిక్షణ పొందిన పదిమంది టీచర్లు విధుల్లో ఉంటారు. ప్రతి జవాబుపత్రాన్ని స్పెషల్‌ అసిస్టెంట్లు స్కానింగ్‌చేసి మూల్యాంకనం నిర్వహించే టీచర్లకు అందజేస్తారు.

జూబ్లీ ఉన్నత పాఠశాలలోని 24 గదులను మూల్యాంకనానికి వినియోగిస్తున్నారు. ప్రతి గదికి నాలుగు నుంచి ఐదుగురు స్పెషల్‌ అసిస్టెంట్లను నియమించారు. జవాబు పత్రంలో 24 పేజీలు ఉంటాయి. మూల్యాంకనం చేసే టీచర్లకు రోజుకు ఒకరికి 40 జవాబుపత్రాలు అందజేస్తారు. ఒక టీచరు ఒక రోజులో మూల్యాంకనంచేసే జవాబుపత్రాల్లో మొత్తం 960 పేజీలుంటాయి. ప్రతిగదికి 24 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు (టీచర్లు ) విధుల్లో ఉంటారు. స్కానింగ్‌ చేయడానికి వీలుగా స్పెషల్‌ అసిస్టెంట్లకు రెండురోజుల క్రితం శిక్షణ ఇచ్చారు. కాగా స్కానింగ్‌ చేయడానికి సమయం పడుతుందని భావిస్తుండగా వేగంగా ప్రక్రియ పూర్తిచేసేలా శిక్షణ ఇచ్చామని డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. మూల్యాంకనం నిర్వహించే జూబ్లీ పాఠశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. జవాబుపత్రాల స్టోరేజ్‌ పాయింట్‌ ఉండడంతో పోలీసు అవుట్‌ పోస్టు ఏర్పాటు చేశారన్నారు. వేసవి దృష్ట్యా విధుల్లోని వారికి తాగునీరు, రోజుకు రెండుసార్లు మజ్జిగ సరఫరాచేస్తామన్నారు. మొదటి రోజు ఉదయం 8.30 గంటలకే విధులకు హాజరుకావాలన్నారు.

శరవేగంగా వార్డుల విభజన ప్రక్రియ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేయడంతో పాటు 2011 జనాభాలెక్కల ప్రకారం వార్డుల విభజన ప్రక్రియను ఈనెల తొమ్మిదినాటికి పూర్తిచేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీన వార్డుల విభజన ప్రక్రియను ప్రారంభించిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సగటున ఒక్కోవార్డుకు 15,840 మంది జనాభా వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిప్రకారం డోర్‌నంబరు, ఎన్యుమరేషన్‌బ్లాక్‌ల ఆఽధారంగా వార్డుల సరిహద్దులను గుర్తిస్తున్నారు. ఆదివారం సెలవు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వార్డుల విభజన ప్రక్రియను కొనసాగించారు. ఈనెల తొమ్మిది వరకు గడవు ఉన్నప్పటికీ ఒకరోజు ముందుగానే ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పనిచేస్తున్నారు.


గ్యాస్‌ సిలిండర్లకు కొనసాగుతున్న డిమాండ్‌

నిరీక్షణలో 1.74 లక్షల మంది

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ సిలిండర్ల కోసం వినియోగదారుల నిరీక్షణ కొనసాగుతోంది. పుష్కలంగా నిల్వలున్నాయని ప్రభుత్వం చెబుతున్నా వినియోగదారుల్లో ఆందోళన తగ్గలేదు. దీంతో ఆదివారానికి జిల్లాలో సిలిండర్‌ కోసం 1,74,167 మంది నిరీక్షిస్తున్నారు. కాగా డీలర్ల వద్ద 34,635 సిలిండర్లు ఉండగా 20,638 సిలిండర్లు డెలివరీ చేశారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న తొమ్మిది నుంచి పదిరోజుల వరకు సిలిండర్‌ కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే నగరంలో వాణిజ్య సిలిండర్ల రెగ్యులర్‌ సరఫరాలో 70 శాతం వరకు వ్యాపారులకు అందజేస్తున్నారు. ధర పెరిగినా హోటళ్లు, రెస్టారెంట్లు కొనుగోలుచేస్తున్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాను కంపెనీలు పెంచాయని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కరరావు తెలిపారు. గృహవసరాల సిలిండర్లకు కొరతలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:45 AM