Share News

10.770 లీటర్ల లిక్విడ్‌ గంజాయి పట్టివేత

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:59 PM

పెదబయలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీల్లో ద్రవరూప గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒకరు పట్టుబడగా.. మరో ఇద్దరు పరారీ అయ్యారని ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

10.770 లీటర్ల లిక్విడ్‌ గంజాయి పట్టివేత
లిక్విడ్‌ గంజాయి నిందితుడితో ఎస్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది.

ఒకరి అరెస్టు.. మరో ఇద్దరు పరారీ

పట్టుబడిన గంజాయి విలువ రూ.1.34 కోట్లు

పెదబయలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండంలోని సీతగుంట ఏవోబీ వంతెన వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్‌ఐ వెంకటేష్‌ తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటువైపుగా ఓ వ్యక్తి బ్యాగుతో నడుచుకుంటూ వంతెన దాటి ఒడిశాకు వెళ్లే క్రమంలో పోలీసులను చూసి పరారీ కావడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడి పట్టుకున్నారు. అతని బ్యాగు తనిఖీ చేయగా.. అందులో పది ప్యాకెట్ల ద్రవరూప గంజాయిని గుర్తించారు. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. పట్టుబడిన ద్రవరూప గంజాయి విలువ మార్కెట్‌లో సుమారు రూ.1.34 కోట్లు ఉంటుందన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. వారి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - Sep 26 , 2026 | 11:59 PM