రిజిస్ట్రేషన్ల ఆదాయం 1,066.19 కోట్లు
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:15 AM
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల ముగిసేసరికి రూ.వేయి కోట్లు దాటి ఆదాయాన్ని నమోదు చేసింది.
లక్ష్యంలో 73.75 శాతం సాధన
గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే మాత్రం 12.26 శాతం వృద్ధి
ఐటీ కంపెనీల రాకతో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల ముగిసేసరికి రూ.వేయి కోట్లు దాటి ఆదాయాన్ని నమోదు చేసింది. జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, వాటి ద్వారా రూ.1,066.19 కోట్లు వచ్చింది. ప్రభుత్వం ఫిబ్రవరి వరకూ ఇచ్చిన లక్ష్యం రూ.1,445.7 కోట్లు కాగా, అందులో 73.75 శాతం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రూ.949.77 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఆదాయంలో 12.26 శాతం వృద్ధి కనిపిస్తోంది.
విశాఖపట్నం జిల్లా వరకు చూసుకుంటే కొత్త ఐటీ కంపెనీలు రావడంతో సాఫ్ట్‌వేర్ రంగానికి చెందినవారు ఫ్లాట్లు, ఇళ్ల స్థలాల కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. వీఎంఆర్‌డీఏ ఎంఐజీ ప్లాట్లకు నిర్వహిస్తున్న వేలం పాటలకు స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొద్దికొద్దిగా పుంజుకుంటోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్క ఫిబ్రవరి నెల వరకూ చూసుకుంటే జిల్లాలో తొమ్మిది కార్యాలయాలకు కలిపి ప్రభుత్వం రూ.147.76 కోట్ల లక్ష్యం ఇవ్వగా, అందులో 96.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది లక్ష్యంలో 65.60 శాతం.
కార్యాలయాల వారీగా ఫిబ్రవరిలో ఆదాయం వివరాలు
--------------------------------------------------------------------
కార్యాలయం లక్ష్యం ఆదాయం
---------------------------------------------------------------------
ఆనందపురం రూ.8.52 కోట్లు రూ.10.38 కోట్లు
భీమునిపట్నం రూ.8.72 కోట్లు రూ.7.51 కోట్లు
ద్వారకానగర్ రూ.15.49 కోట్లు రూ.9.92 కోట్లు
గాజువాక రూ.14.27 కోట్లు రూ.6.02 కోట్లు
గోపాలపట్నం రూ.7.58 కోట్లు రూ.4.17 కోట్లు
మధురవాడ రూ.34.19 కోట్లు రూ.26.45 కోట్లు
పెందుర్తి రూ.10.49 కోట్లు రూ.7.87 కోట్లు
సూపర్‌బజారు రూ.36.06 కోట్లు రూ.19.4 కోట్లు
పెదగంట్యాడ రూ.12.44 కోట్లు రూ.5.21 కోట్లు
-----------------------------------------------------------------------
మొత్తం రూ.147.76 కోట్లు రూ.96.93 కోట్లు
----------------------------------------------------------------------