1,025 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:31 AM
ఆంధ్ర- తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని ఒడిశాలోని కలిమెల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని కలిమెల సీఐ ప్రభుదత్తవిశ్వాలు తెలిపారు.
విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా
నిందితులు పరారీ
సీలేరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర- తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని ఒడిశాలోని కలిమెల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని కలిమెల సీఐ ప్రభుదత్తవిశ్వాలు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎంవీ-73 గ్రామం అటవీ ప్రాంతంలో గంజాయిని కొందరు వ్యక్తులు తీసుకు వచ్చి రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచారు. పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలిసి నిందితులు పరారయ్యారు. ఈ గంజాయిని కలిమెల తహశీల్దార్ రామకృష్ణ సత్య రాజగురు సమక్షంలో తూకం వేయగా 1,025 కిలోలు ఉందని నిర్ధారించామని సీఐ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు.
ముంచంగిపుట్టులో 50 కిలోలు స్వాధీనం
ముంచంగిపుట్టు: మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు సమీపంలో పోలీసులు బుధవారం 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ పి.నాని తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. లబ్బూరు సమీపంలో బుధవారం వాహన తనిఖీలు చేపడుతుండగా లక్ష్మీపురం వైపు నుంచి వస్తున్న కారు పోలీసులను చూసి ఆపి అందులో ఉన్న నలుగురు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా అందులో 50 కిలోల గంజాయి ఉంది. దానిని స్వాధీనం చేసుకుని డుంబ్రిగుడ మండలానికి చెందిన పాపారావు, నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రానికి చెందిన బిషూ, దామును అరెస్టు చేశారు.
హుకుంపేటలో ఏడు కిలోలు...
హకుంపేట: స్థానిక కొంతిలి జంక్షన్ వద్ద బుధవారం ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశామని ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పోలీసులు బుధవారం సాయంత్రం కొంతిలి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఏడు కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడు ఒడిశా రాష్ట్రం మాచ్‌ఖండ్ మండలం ఏనుగు గ్రామానికి చెందిన అజిత్ సీసాను పోలీసులు అరెస్టు చేశారు. అతనితో వస్తున్న పరశురామ్ ఖారా, రాము అనే ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని ఎస్‌ఐ తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామన్నారు.