Share News

ల్యాండ్‌ బ్యాంకు భూములకు 100 అడుగుల రోడ్డు

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:52 AM

మండలంలో భారీ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్‌ బ్యాంకు భూములకు వంద అడుగుల రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపయ్యపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ‘ల్యాండ్‌ బ్యాంకు’ కింద గుర్తించారు.

ల్యాండ్‌ బ్యాంకు భూములకు   100 అడుగుల రోడ్డు
శెట్టిపాలెం వద్ద 100 అడుగుల రోడ్డును కలిపే ప్రాంతం ఇదే

ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు

నిర్వాసితుల జాబితా తయారీ

పలు కంపెనీల ఏర్పాటుకు వచ్చే నెలల సీఎం శంకుస్థాపన?

మాకవరపాలెం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో భారీ కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్‌ బ్యాంకు భూములకు వంద అడుగుల రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపయ్యపాలెం గ్రామాల్లో 4,250 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ‘ల్యాండ్‌ బ్యాంకు’ కింద గుర్తించారు. ఈ భూముల్లో ఒక భారీ కంపెనీ ఏర్పాటవుతుందని, సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శంకుస్థాపన చేస్తారని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల ప్రకటించారు. ఈ నాలుగు గ్రామాల్లోని భూములను ఏపీఐఐసీ ఎండీ దినేశ్‌కుమార్‌ ఇటీవల పరిశీలించారు. మొత్తం భూముల్లో సుమారు మూడు వేల ఎకరాలు డి.పట్టా భూములుకాగా, వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు వున్నాయి. 50-60 ఎకరాలు జిరాయితీ భూములు వుండే అవకాశం వుంది. ల్యాండ్‌ బ్యాంకుగా గుర్తించిన భూముల్లో ఏర్పాటు చేసే కంపెనీలు, పరిశ్రమలకు నీటి అవసరాలను తీర్చడానికి పాపయ్యపాలెం రిజర్వాయర్‌ వుంది.

ఇదిలావుండగా పైడిపాల నుంచి మాకవరపాలెం, తామరం, భీమబోయినపాలెం మీదుగా శెట్టిపాలెం సమీపంలో కాఫీ పొడి తయారీ కేంద్రం వద్ద ఉన్న రహదారి వరకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి అధికారులు మ్యాప్‌ సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి ఎరకన్నపాలెం వాక రోడ్డుకి దీనిని అనుసంధానం చేస్తారు. వంద అడుగుల వెడల్పుతో నిర్మించే రహదారి కోసం ప్రభుత్వ, డి.పట్టా భూములతో పాటు జిరాయితీ భూముల వివరాలు, ఆయా రైతుల పేర్లలతో జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. మండలంలో ఏర్పాటు కానున్న పలు కంపెనీలతోపాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న వంద అడుగుల రహదారుల పనులకు సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసే అవకాశం వుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 10 , 2026 | 12:52 AM