ముగిసిన నామినేషన్ల పరిశీలన
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:31 AM
జీవీఎంసీ మేయర్ పదవికి 29 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 21 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దయానిధి ఆమోదించారు.
జీవీఎంసీ మేయర్ పదవికి 21 నామినేషన్లు ఆమోదం
ఎనిమిది తిరస్కృతి
వార్డులకు 1,641 నామినేషన్లు ఆమోదం
31 తిరస్కృతి
ఉపసంహరణకు 21 వరకూ అవకాశం
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్ పదవికి 29 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 21 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దయానిధి ఆమోదించారు. వివిధ కారణాలతో ఎనిమిదింటిని తిరస్కరించారు. మేయర్, కార్పొరేటర్ పదవులకు ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అభ్యర్థుల సమక్షంలో చేపట్టారు. నామినేషన్ల తిరస్కరణకు గల కారణాలను అధికారులు వివరించారు.
వైసీపీకి చెందిన వరుదు కళ్యాణి, పేడాడ రమణకుమారి, తిప్పల వెంకటవిజయకుమారి, తెలుగుదేశం పార్టీకి చెందిన ముక్కా శ్రావణి, శానాపతి వసంత, బీసీవైకు చెందిన నమ్మి భార్గవి, బీఎస్పీ తరపున కరణం కీర్తన గ్రేస్, కాంగ్రెస్ నుంచి జెర్రిపోతుల వెంకటలక్ష్మి, ఉష్నార ప్రవీణ్, దేవర నాగసుందరీదేవి, దండి ప్రియాంక్, షేక్ దౌల్తున్నీషా, బోర సంతోషి, ప్రజా ప్రస్తావన పార్టీకి చెందిన తలుపుల శైలజ, స్వతంత్రులు వియ్యపు ఉమ, ప్రకృతి సీవీవీఏఆర్‌కే దేవిక, వాండ్రాసి శాంతికుమారి, గొంప వెంకట పద్మావతి, పులిచర్ల రాజేశ్వరి, ఫాన్సీ నమ్మ అత్తిలి, లండ లితిక నామినేషన్లు ఆమోదం పొందాయి. ఏడుగురి నామినేషన్లను తిరస్కరించారు.
వార్డులకు...
120 వార్డులకు 1,672 నామినేషన్లు దాఖలు కాగా 1,641 ఆమోదం పొందాయి. జీవీఎంసీ పరిధిలోని పది జోనల్ కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ పరిధిలో దాఖలైన నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో నిబంధనలకు అనుగుణంగా, అన్ని వివరాలు ఉన్న 1,641 నామినేషన్లను ఆమోదించారు. వివిధ కారణాలతో 31 నామినేషన్లను తిరస్కరించారు. భీమిలి జోన్‌లో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మధురవాడ జోన్‌లో అన్ని ఆమోదం పొందాయి. తూర్పు జోన్‌లో నాలుగు, ‘సౌత్’ జోన్‌లో రెండు, ‘నార్త్’ జోన్‌లో ఐదు, పశ్చిమ జోన్‌లో పది, గాజువాక జోన్‌లో ఎనిమిది, పెందుర్తి జోన్‌లో రెండు నామినేషన్లను తిరస్కరించారు. అనకాపల్లి, అగనంపూడి జోన్‌లలో అన్నింటినీ ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువు ఉంది. ఆ తరువాత పోటీలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వస్తుంది.