కూటమి క్లీన్ స్వీప్
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:28 AM
జిల్లాలోని నాలుగు మండలాల్లో అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కూటమికి చెందిన అభ్యర్థులే ఎన్నికయ్యారు.
నాలుగు ఎంపీపీ పీఠాలు కైవసం
టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు...
ఆనందపురం ఎంపీపీగా తాట్రాజు అప్పారావు
భీమిలి ఎంపీపీగా ఎరబాల కృష్ణవేణి
పద్మనాభం ఎంపీపీగా అరుణకుమారి, పెందుర్తి ఎంపీపీగా సంతోషికుమారి
వైస్ ఎంపీపీ పదవులు కూడా కూటమికే...
విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని నాలుగు మండలాల్లో అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కూటమికి చెందిన అభ్యర్థులే ఎన్నికయ్యారు. ఆనందపురంలో తాట్రాజు అప్పారావు (టీడీపీ), భీమిలిలో ఎరబాల కృష్ణవేణి (టీడీపీ), పద్మనాభంలో కుచ్చర్లకోట అరుణకుమారి (టీడీపీ), పెందుర్తిలో మడక సంతోషికుమారి (జనసేన) మండలాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
మండల పరిషత్ కార్యాలయాల్లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ముందుగా ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో కూటమికి మూడింట రెండింతుల మెజారిటీ ఉండడంతో వైసీపీ సభ్యులు పోటీకి దిగలేదు. దీంతో భీమిలి ఎంపీపీగా ఎరబాల కృష్ణవేణి, పద్మనాభం ఎంపీపీగా కుచ్చర్లకోట అరుణకుమారి, పెందుర్తి ఎంపీపీగా మడక సంతోషికుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆనందపురం ఎంపీపీ పదవికి టీడీపీతోపాటు వైసీపీ అభ్యర్థి పోటీపడ్డారు. టీడీపీ నుంచి తాట్రాజు అప్పారావుకు 10 మంది, వైసీపీ అభ్యర్థి గండ్రెడ్డి శ్రీనివాసరావుకు ఏడుగురు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో తాట్రాజు అప్పారావు ఎంపీపీగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
మండలాధ్యక్షుల ఎంపిక పూర్తయిన తరువాత వైస్ ఎంపీపీ పదవుల ఎన్నిక నిర్వహించారు. ఆనందపురం వైస్ ఎంపీపీ పదవికి టీడీపీ, వైసీపీలు పోటీపడడంతో ఎన్నికలు నిర్వహించారు. తెలుగుదేశం నుంచి ఆబోతు యమున, వైసీపీ నుంచి గొలగాని రవికుమార్ పోటీ పడగా పదిమంది సభ్యులు యమునకు చేతులెత్తి మద్దతు తెలిపారు. దీంతో ఆమె వైస్ ఎంపీపీగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. కాగా భీమిలి వైస్ ఎంపీపీగా రాంబోతు నాగరాజు (జనసేన), పద్మనాభం వైస్ ఎంపీపీగా కాళ్ల నగేష్‌కుమార్ (టీడీపీ), పెందుర్తి వైస్ ఎంపీపీగా తాడి గోవిందు (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసినట్టు జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.
జడ్పీ చైర్‌పర్సన్‌గా గాడు అలివేణి
వైస్ చైర్మన్‌గా అజయ్
నేడు ఎన్నిక ప్రక్రియ
విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా భీమిలి నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన గాడు అలివేణిని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. వైస్ చైర్మన్‌గా పెందుర్తి జడ్పీటీసీ సభ్యుడు సుఖవాసి అజయ్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభిస్తారు. ఇందుకు జడ్పీ సమావేశ మందిరాన్ని సిద్ధం చేశారు.
పునర్విభజన తరువాత విశాఖ జిల్లాలో కేవలం నాలుగు (ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి) మండలాలే మిగిలాయి. నాలుగింటిలో మూడుచోట్ల (భీమిలి, పద్మనాభం, పెందుర్తి) టీడీపీ, ఒకచోట (ఆనందపురం) జనసేన అభ్యర్థి జడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. ఈ నలుగురితో తొలుత కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్‌ను వేదికపైకి ఆహ్వానించి ప్రమాణం చేయిస్తారు. తదుపరి వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టి, ప్రమాణం చేయిస్తారు.
కేవలం నలుగురు మాత్రమే ఉన్నందున సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక గంటలోపే పూర్తవుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు నలుగురు సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులైన భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, విశాఖ, అనకాపల్లి ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావులను ఆహ్వానించారు. ఎన్నికల ప్రక్రియను కల్టెర్ నిర్వహిస్తారు. ఆయనకు జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో ఇ.సందీప్ సహకారం అందిస్తారు. కాగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేశామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు.
---
అనకాపల్లి జిల్లాలో కూటమికి 22, వైసీపీకి 1...
అనకాపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలోనూ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 24 మండలాలకుగాను ఏకంగా 22 మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. వీటిలో 20 మండలాల్లో టీడీపీ, రెండు మండలాల్లో జనసేన అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. రాంబిల్లి మండలంలో టీడీపీ బీ ఫారం ఇచ్చిన అభ్యర్థిపై అదే పార్టీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యురాలు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఇక ప్రతిపక్ష వైసీపీకి ఒకే ఒక్క ఎంపీపీ (మునగపాక) పదవి...అది కూడా లాటరీ ద్వారా దక్కింది. ఎన్నికలు నిర్వహించిన మండల ఉపాధ్యక్ష పదవులన్నింటినీ కూటమి కైవసం చేసుకుంది. వీటిలో టీడీపీ 9, జనసేన 8, బీజేపీ మూడుచోట్ల గెలిచాయి. చోడవరం నియోజకవర్గంలోని మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు.
అల్లూరి జిల్లాలో వైసీపీకి 6, కూటమికి 3
పాడేరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం 11 మండలాలకుగాను వైసీపీ 6, కూటమి 3 ఎంపీపీ పీఠాలను దక్కించుకున్నాయి. గూడెంకొత్తవీధిలో స్వతంత్ర అభ్యర్థి మండలాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డుంబ్రిగుడ మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను ఎనిమిది మంది మాత్రమే హాజరుకావడంతో కోరం లేదని ఎన్నికను శుక్రవారానికి వాయిదా పడింది.
పంచాయతీకి నోటిఫికేషన్
జిల్లాలో 79 పంచాయతీలు, 802 వార్డులు
మొత్తం ఓటర్లు 1,62,407
రేపటి నుంచి 23 వరకూ నామినేషన్ల స్వీకరణ
ఉపసంహరణకు 27వ తేదీ వరకూ గడువు
అదేరోజు అభ్యర్థుల తుది జాబితా
వచ్చే నెల రెండో తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు
విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 79 మంది సర్పంచులు, 802 మంది వార్డు సభ్యుల ఎన్నికకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాలో చివరి విడతలో జరగనున్నాయి. ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో 79 గ్రామ పంచాయతీల పరిధిలో 1,62,407 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు ఆయా పంచాయతీలకు కేటాయించిన 23 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు స్వీకరించే సమయానికి ప్రతి పంచాయతీ ఓటర్ల జాబితాను సంబంధిత పంచాయతీ రిటర్నింగ్ అధికారి ప్రదర్శిస్తారు. నామినేషన్ల దాఖలు చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.మూడు వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,500, వార్డు సభ్యులకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,000, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.500 డిపాజిట్ కింద చెల్లించాలి. ఈనెల 24వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఒకవేళ ఏ కారణంతోనైనా నామినేషన్లు తిరస్కరిస్తే 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సంబంధిత ఆర్డీవో వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ మరుసటిరోజు అంటే 26వ తేదీన అప్పీల్‌పై ఆర్డీవో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ తరువాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. అభ్యర్థి పేరు, ఇంటి పేరులో ఏది ముందుగా నామినేషన్‌లో పేర్కొంటే దాని ప్రకారం వరుసక్రమంలో గుర్తులు కేటాయించనున్నారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. బ్యాలెట్‌పై అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం సదరు అభ్యర్థికి కేటాయించిన గుర్తులు మాత్రమే ముద్రిస్తారు. వాటి ఆధారంగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. వచ్చే నెల రెండో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. వెంటనే ఎన్నికైన అభ్యర్థుల నుంచి ప్రతిజ్ఞ చేయిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడితే ఆ మరుసటిరోజు ఎన్నిక ప్రక్రియ పూర్తిచేయాలి. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా పంచాయతీ అధికారి ఎంవీఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్-1లో నియమితులైన అధికారులు నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా విడుదల వరకు విధులు నిర్వహిస్తారన్నారు. స్టేజ్-2లో అధికారులు పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తిచేస్తారని వివరించారు. పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చే ఓటరు ఎడమ చేతి చిటికెన వేలుపై సిరా రాస్తారని పేర్కొన్నారు.