Share News

జీవీఎంసీ మేయర్‌ పదవికి ఆరు నామినేషన్లు

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:08 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ పదవికి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి.

జీవీఎంసీ మేయర్‌ పదవికి ఆరు నామినేషన్లు

వైసీపీ అభ్యర్థినిగా వరుదు కళ్యాణి...

కార్పొరేటర్‌ పదవులకు 528 మంది నామినేషన్‌

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ పదవికి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ మేయర్‌ అభ్యర్థిని వరుదు కళ్యాణి ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, కేకే రాజులతోపాటు మరికొందరు నేతలతో కలిసి వచ్చి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి దయానిధికి ఒక సెట్‌ నామినేషన్‌ అందజేశారు. అలాగే భారత చైతన్య యువజన పార్టీ తరపున నమ్మి భవానీ రెండు సెట్లు, బీఎస్పీ తరఫున కరణం కీర్తనగ్రేస్‌ ఒక సెట్‌, ఇండిపెండెంట్‌లుగా వియ్యపు ఉమ ఒక సెట్‌, పకృతి సీవీవీఏఆర్‌కే దేవిక ఒక సెట్‌, వాండ్రాసి శాంతికుమారి ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా కార్పొరేటర్‌లుగా పోటీ చేసేందుకు 528 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి జోన్‌లో 11, మధురవాడ జోన్‌లో 31, తూర్పు జోన్‌లో 41, దక్షిణ జోన్‌లో 107, ఉత్తర జోన్‌లో 61, పశ్చిమ జోన్‌లో 57, గాజువాక జోన్‌లో 150, అగనంపూడి జోన్‌లో 34, అనకాపల్లి జోన్‌లో ఒకటి, పెందుర్తి జోన్‌లో 35 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.


ఎన్నికల పరిశీలకుల నియామకం

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ఎన్నికల పరిశీలకునిగా ఏపీ సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ ఎ.భార్గవ తేజ, వ్యయ పరిశీలకునిగా ఏలూరు డీఎఫ్‌వో పి.వెంకట సందీప్‌రెడ్డిని నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.


పీజీఆర్‌ఎస్‌ రద్దు

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

మహానవమి, జీవీఎంసీ ఎన్నికల కారణంగా ఈనెల 19, 26 తేదీల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడు తెలిపారు.

Updated Date - Oct 18 , 2026 | 01:08 AM