Share News

అదరగొట్టిన ఆంధ్ర మెడికల్‌ కళాశాల

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:52 AM

ఇండియన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐఐఆర్‌ఎఫ్‌) తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆంధ్ర మెడికల్‌ కళాశాల (ఏఎంసీ) జాతీయ స్థాయిలో 13వ స్థానం సాధించింది.

అదరగొట్టిన ఆంధ్ర మెడికల్‌ కళాశాల

ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో జాతీయ స్థాయిలో 13వ స్థానం దక్కించుకున్న ఏఎంసీ

దక్షిణ భారతదేశంలో నాలుగో స్థానం

బోధన, పరిశోధన, ఫలితాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకు కేటాయింపు

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

ఇండియన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐఐఆర్‌ఎఫ్‌) తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆంధ్ర మెడికల్‌ కళాశాల (ఏఎంసీ) జాతీయ స్థాయిలో 13వ స్థానం సాధించింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఐఆర్‌ఎఫ్‌ ఈ ర్యాంకులు ఇస్తుుంది. ఈసారి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ 953 స్కోరుతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, ఆంధ్ర మెడికల్‌ కళాశాల 937 స్కోరుతో 13వ ర్యాంకు (దక్షిణ భారతదేశంలో నాలుగో స్థానం) దక్కించుకుంది. ఈ ర్యాంకుతో జాతీయ స్థాయిలో ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు మంచి గుర్తింపు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఆరు కేటగిరీల్లో అంశాలు పరిశీలన

ఆరు కేటగిరీల్లో మెడికల్‌ కళాశాల పనితీరు...మౌలిక వసతులు, అధ్యాపకులు, విద్యార్థుల రేషియో, బోధన వనరులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిశోధన పత్రాలు, పరిశోధన ఫలితాలు, కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలు వంటి అంశాలను సదరు సంస్థ పరిశీలించింది. టీచింగ్‌ లెర్నింగ్‌ రీసోర్స్‌ అండ్‌ పెడగాజీలో 158.47, రీసెర్చ్‌ అవుట్‌కమ్‌ (వాల్యూమ్‌, ఇన్‌కమ్‌ అండ్‌ రెప్యుటేషన్‌)లో 159.57, ఇన్నోవేటివ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 153.67, సోషల్‌ ఇన్‌క్లూజన్‌లో 155.33, ఫ్యూచర్‌ ఓరియంటేషన్‌లో 153.33, ఎక్స్‌టర్నల్‌ పెర్‌సెప్షన్‌లో 150.83 స్కోరు ఏఎంసీ సాధించింది.

జాతీయ స్థాయిలో గుర్తింపు

తాజా ర్యాంకింగ్‌తో జాతీయ స్థాయిలో మెడికల్‌ కాలేజీకి గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. రీసెర్చ్‌లో మంచి ర్యాంకు రావడం వల్ల పరిశోధన ప్రాజెక్టులు, పబ్లికేషన్లు, అకడమిక్‌ సహకారంపై మరింత దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

గౌరవంగా భావిస్తున్నాం

- డాక్టర్‌ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి, ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

జాతీయ స్థాయిలో ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు 13వ ర్యాంకు కేటాయించడం గౌరవంగా భావిస్తున్నాం. మౌలిక వసతులు, బోధన, పరిశోధన వంటి అనేక అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుండడం వల్లే ఈ ర్యాంకు సాధ్యమైంది. కొద్దిరోజుల్లో విడుదల చేయనున్న ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లోనూ ఇదే తరహాలో మంచి ర్యాంకు సాధిస్తామని భావిస్తున్నాం. ఈ ర్యాంకు మా పనితీరుకు ప్రోత్సాహకంగా భావిస్తున్నాం. విద్యార్థులు కూడా గర్వంగా భావించాల్సిన సమయం. భవిష్యత్తులోనూ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తాం.

Updated Date - Aug 09 , 2026 | 12:52 AM