గ్యాస్ పంపిణీలో మాయ
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:13 AM
గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కొన్ని ఏజెన్సీల్లో నిర్వాహకులు, డెలివరీ బాయ్‌లు కలిసి వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
డెలివరీ బాయ్‌లకు ఓటీపీలు?
ఏజెన్సీల నిర్వాహకుల పాత్ర ఉందని ఆరోపిస్తున్న వినియోగదారులు
బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు ఇవ్వకుండా డెలివరీ బాయ్‌ల పరారీ
ద్వారకానగర్‌లో 50, చినగంట్యాడలో 30 సిలిండర్లతో అదృశ్యం
కేసులు పెట్టామని ఊరడింపు మాటలు
పట్టుబడని నిందితులు
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కొన్ని ఏజెన్సీల్లో నిర్వాహకులు, డెలివరీ బాయ్‌లు కలిసి వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు వినియోగదారునికి మాత్రమే చేరాల్సిన ఓటీపీ కొన్ని ప్రాంతాల్లో డెలివరీ బాయ్‌లకు కూడా అందుతోందంటున్నారు. దాంతో ఆ సిలిండర్ నిర్దేశిత వినియోగదారుడికి అందకుండా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోతోందంటున్నారు. అక్కడ దానిని డిమాండ్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముకుంటున్నారు. ఈ లాభాన్ని అంతా కలిసి పంచుకుంటున్నారనే అభియోగాలు వస్తున్నాయి. వినియోగదారులు ఏజెన్సీకి వెళ్లి అడిగితే ఏదో చెప్పి మళ్లీ సిలిండర్ బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. లేదంటే వారం రోజులు తిప్పించుకొని సిలిండర్ ఇస్తున్నారు. ద్వారకా నగర్‌లో ఒక ఏజెన్సీ బాయ్ వినియోగదారులకు చెందిన సుమారుగా 50 సిలిండర్లు ఇలాగే తీసుకొని పరారు కావడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఏజెన్సీ నిర్వాహకులు సర్దిచెప్పారు.
తాజాగా చినగంట్యాడలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ డెలివరీ బాయ్ అప్పారావు వినియోగదారులకు చెందిన 30 సిలిండర్లతో పరారైపోయాడు. నెల క్రితం సిలిండర్ బుక్ చేసుకుంటే ఇప్పటివరకూ ఇవ్వలేదని ఆరోపిస్తూ పలువురు గ్యాస్ ఏజెన్సీకి వచ్చి ఫిర్యాదు చేశారు. మీకు ఓటీపీలు పదో తేదీనే వచ్చాయని, సిలిండర్లు డెలివరీ అయిపోయాయని ఏజెన్సీ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. ఓటీపీలు వచ్చిన మాట వాస్తవమేనని, డెలివరీ బాయ్ సిలిండర్లు ఇవ్వలేదని, ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, అందుకే తామంతా ఇక్కడకు వచ్చామని వారు పేర్కొన్నారు. ఈ విధంగా మొత్తం 30 సిలిండర్లు పక్కదోవ పట్టాయని తేలడంతో ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ బాయ్‌పై కేసు పెడుతున్నట్టు తెలిపారు.
అధికారులకు అందని సమాచారం
గ్యాస్ ఏజెన్సీలలో పనిచేసే డెలివరీ బాయ్‌లు చేస్తున్న మోసాలు, వాటిపై నమోదు అవుతున్న కేసులపై జిల్లా అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. ఏజెన్సీ నిర్వాహకులు ఈ సమాచారం పౌర సరఫరాల శాఖకు, గ్యాస్ కంపెనీలకు చెప్పాల్సి ఉన్నా దాచి పెడుతున్నారు. ఏజెన్సీ, బాయ్‌ల మధ్య ఉన్న వాటాల పంపిణీ వల్ల ఇవన్నీ తొక్కి పెడుతున్నారంటున్నారు. అసలు ఓటీపీలు డెలివరీ బాయ్‌లకు ఎలా వెళుతున్నాయనే దానిపై ఎవరూ మాట్లాడడం లేదు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ సరఫరా సంస్థలు పట్టనట్టు ఉంటున్నాయి. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ ఏజెన్సీ నిర్వాహకులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేసి తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. డెలివరీ బాయ్‌లపై పోలీసు కేసుల విషయం కూడా నిగ్గు తేల్చాల్సి ఉంది. కేసులు పెట్టకుండానే పెట్టామని డీలర్లు బుకాయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పౌర సరఫరాల శాఖాధికారులు దాడుల్లో సిలిండర్లు పట్టుకొంటున్నారు. అవి అసలు బ్లాక్ మార్కెట్‌కు ఎలా వెళ్లాయి?, ఏ డెలివరీ బాయ్‌లు వాటిని విక్రయించారు? ...అనే అంశాలపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు ఆ కోణంలోను దర్యాప్తు చేస్తే..డెలివరీ బాయ్‌లు, వారి వెనుక ఉన్న వారి బండారం బయటపడుతుంది.