Share News

తాజా మాజీల్లో గందరగోళం

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:51 AM

జీవీఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న తాజా మాజీ కార్పొరేటర్ల ఆశలపై వార్డుల సంఖ్య పెంపు నిర్ణయం నీళ్లు చల్లింది.

తాజా మాజీల్లో గందరగోళం

వార్డుల పునర్విభజన ప్రతిపాదనతో అయోమయం

పదవీకాలం ముగిసినప్పటికీ మళ్లీ పోటీ చేయాలనే ఉద్దేశంతో వార్డులో పర్యటిస్తున్న మాజీ కార్పొరేటర్లు

వార్డుల సంఖ్య పెరగనుండడంతో మారనున్న సరిహద్దులు

ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత తమకు అనుకూలమైన వార్డు ఎంపిక చేసుకోవాలనే యోచనలో అత్యధికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న తాజా మాజీ కార్పొరేటర్ల ఆశలపై వార్డుల సంఖ్య పెంపు నిర్ణయం నీళ్లు చల్లింది. మరో ఆరు నెలల్లో కచ్చితంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంతో వార్డుల్లో పట్టు నిలుపుకునేందుకు తాజా మాజీలంతా కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. వారితోపాటు ఎన్నికల్లో పోటీకి దిగాలనుకునే ఆశావహులు కూడా విరివిగా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వార్డుల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు జారీచేయడంతో ప్రస్తుతం ఉన్న వార్డుల స్వరూపాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారందరికీ దిక్కుతోచని స్థితి ఎదురైనట్టయింది.

జీవీఎంసీ పరిధిలో భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీలు విలీనమైన తర్వాత 2021లో ఎన్నికలు జరిగాయి. అప్పటివరకూ ఉన్న 72 వార్డులను 98 వార్డులకు పెంచారు. ఎన్నికలు నిర్వహించడంతో 98 మంది కార్పొరేటర్లు కౌన్సిల్‌లో అడుగుపెట్టారు. వారందరి ఐదేళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగిసింది. వెంటనే ఎన్నికలు జరుపుతామని సీఎం ప్రకటించడంతో తాజా మాజీ కార్పొరేటర్లంతా అవకాశం ఉన్నంతవరకు ప్రతిరోజూ వార్డులో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వారితోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనవారు, త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీకి దిగాలనే ఆలోచనలో ఉన్నవారు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూవస్తున్నారు. ఇలాంటి తరుణంలో 15 లక్షలకు పైబడిన జనాభా కలిగిన జీవీఎంసీలో వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 98 వార్డుల ముఖచిత్రాలు పూర్తిగా మారిపోతాయి. ఏ వార్డులోకి ఏఏ ప్రాంతాలు వెళతాయో ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదు. వార్డుల పునర్విభజన తర్వాత రిజర్వేషన్‌ ఖరారు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే వార్డుల్లో డబ్బు ఖర్చుపెట్టినా, ప్రజలకు సేవ చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చునని, పునర్విభజన, రిజర్వేషన్‌ ఖరారైన తరువాత తమకు అనుకూలంగా ఉండే వార్డును ఎంపిక చేసుకుని...అప్పుడు కార్యక్రమాలు ప్రారంభించవచ్చుననే ఆలోచనలో తాజా మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:51 AM