కృష్ణాపై మరో 2 బ్యారేజ్‌లు
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:06 AM
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన, దిగువన రెండు బ్యారేజ్‌లు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు.
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన, దిగువన చెరొకటి
స్థానిక వరద నీటి నిల్వ కోసం వెంటనే చేపట్టాలి
దీనిపై గత ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపాలి
హిరమండలం లిఫ్ట్‌తో వంశధార నీరు మళ్లింపు
మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల ఉచిత బియ్యం
అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన, దిగువన రెండు బ్యారేజ్‌లు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై శనివారం పలువురు మంత్రులు, సీఎస్ సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణానదికి పైనుంచి ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరదతో బ్యారేజ్ వద్ద నీరు పెరిగిందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. స్థానికంగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన బ్యారేజ్ నిర్మాణం అవసరమని సీఎం అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువన, దిగువన రెండు బ్యారేజ్‌లు కట్టేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. తీవ్ర వాయుగుండంతో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటల మునకపై అధికారులతో సీఎం చర్చించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను అధికారులు వివరించారు. హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్ట్‌కు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ‘‘ఇరిగేషన్, విద్యుత్‌శాఖల ఉన్నతాధికారులు అక్కడ తక్షణం పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. లిఫ్ట్ పనులు పూర్తి చేసి, వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌లోకి తరలించాలి.’’ అని చంద్రబాబు ఆదేశించారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకున్న చర్యలపై అధికారులను సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గాయని, ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి ప్రవాహాలు కొనసాగుతున్నాయన్నారు.
మత్స్యకారులకు అండగా ఉంటాం: అచ్చెన్న
తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో తుఫాన్ ప్రభావిత ప్రాం తాల్లో అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికీ 50 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తక్షణమే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు