Share News

‘తుడా’ను తుడిచేశారు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:49 AM

అధికారం వారిదే.. కంపెనీలూ వారివే.. కాంట్రాక్టులూ సొంతానికే! గత ప్రభుత్వంలో తుడా చైర్మన్లుగా వ్యవహరించిన తండ్రీకొడుకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహిత్‌రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారం వాడేశారు.

‘తుడా’ను తుడిచేశారు!

  • చెవిరెడ్డి, ఆయన కుమారుడి గోల్‌మాల్‌!

  • తుడా చైర్మన్లుగా తండ్రీకొడుకుల ఇష్టారాజ్యం

  • వారే చైర్మన్లు.. వారి ఇంటి కంపెనీకే పనులు

  • రూ.3500 సిమెంటు బెంచీ 8500కు కొనుగోలు

  • తుడా నిధులతో 430 సార్లు ఫ్లైటు ఎక్కిన చెవిరెడ్డి

  • చంద్రగిరి నియోజకవర్గంలోనే 200 కోట్లు ఖర్చు

  • అడ్డగోలుగా నిధుల వాడకం, మళ్లింపు, చేతివాటం

  • చెవిరెడ్డి రెండో కుమారుడి కంపెనీకి 40 కోట్ల పనులు

  • నిబంధనలకు విరుద్ధంగా చెరువులో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

  • చర్యలు తీసుకోండి, సొమ్ము రికవరీ చేయండి

  • ప్రభుత్వానికి విజిలెన్స్‌ విభాగం సిఫారసులు

  • ఐదుగురు తుడా అధికారులు, 9 మంది ఎంపీడీవోలపైనా చర్యలకు సూచన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అధికారం వారిదే.. కంపెనీలూ వారివే.. కాంట్రాక్టులూ సొంతానికే! గత ప్రభుత్వంలో తుడా చైర్మన్లుగా వ్యవహరించిన తండ్రీకొడుకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహిత్‌రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారం వాడేశారు. తుడా నిధులతో చేపట్టిన అన్ని పనుల్లోనూ అంతులేని దోపిడీ.. నిబంధనల ఉల్లంఘనలే. దీనికితోడు నిధులనూ దారి మళ్లించారు. ఈ అక్రమాలకు అధికారులు వంత పాడారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) నిధులను దుర్వినియోగం చేసిన మాజీ చైర్మన్లు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మోహిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారులు సిఫారసు చేశారు. దుర్వినియోగం చేసిన నిధులను వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు వైసీపీ హయాంలో తుడాలో పనిచేసిన పలువురు అధికారులపైనా క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారు. ఐదుగురు తుడా అధికారులపై సీసీఏ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, తొమ్మిదిమంది ఎంపీడీవోలపై చర్యలు చేపట్టాలని సూచించారు. తుడా పరిధిలో ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చేసిన పనులన్నీ సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ మాత్రమే నిర్వహించింది. ఈ సంస్థకు చెవిరెడ్డి రెండో కుమారుడు హర్షిత్‌రెడ్డి ఎండీగా ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. కాగా విజిలెన్స్‌ విచారణకు తొలుత కొందరు తుడా సిబ్బంది సహకరించలేదు. విజిలెన్స్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పేందుకు నిరాకరించారు. దీనిపై ఉన్నతస్థాయి నుంచి హెచ్చరికలు జారీ కావడంతో తుడా అధికారులు దారికి వచ్చారు. ప్రభుత్వం విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీబీ అధికారులు మరో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఏసీబీ విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉందని భావిస్తున్నారు.


విజిలెన్స్‌ విచారణలో గుర్తించిన అక్రమాలు

సొంతానికి 40 కోట్ల విలువైన పనులు

చెవిరెడ్డి మునిరెడ్డి రోశమ్మ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌) అనే సంస్థను చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి స్థాపించారు. చెవిరెడ్డి మరదలు దేశిరెడ్డి సునీత ఇందులో డైరెక్టర్‌. 2019-24 మధ్య తుడా పరిధిలో సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 510 పనులు చేసింది. మొత్తం రూ.40 కోట్ల విలువైన పనులకు ఇప్పటికే రూ.30 కోట్ల బిల్లులు డ్రా చేశారు. ఈ సంస్థ ఏ ఇతర ప్రభుత్వ బహిరంగ టెండర్లలోనూ పాల్గొనలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో, తుడా నిధులతో పిలిచిన టెండర్లలో మాత్రమే పాల్గొని పనులు దక్కించుకుంది.

చెరువులో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌

చెవిరెడ్డి కుటుంబం నివాసముంటున్న తుమ్మలగుంటలోని చెరువు జలవనరులశాఖ పరిధిలో ఉంది. ఈ చెరువు కింద 100 ఎకరాల ఆయకట్టు ఉంది. సుప్రీం కోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ మార్గదర్శకాల ప్రకారం చెరువు గర్భంలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే తుడా అధికారులు సుమారు రూ.58 కోట్ల వ్యయంతో అక్కడ కేవీఎస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. రెవెన్యూ, జలవనరులశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెరువు గర్భాన్ని చదును చేసి కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేశారు. దీంతో వర్షపునీరు చెరువులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. వర్షాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాలు మునిగే ప్రమాదం ఏర్పడింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా రూ.25 కోట్లను నాన్‌-నేషనలైజ్డ్‌ బ్యాంకుల్లో నాన్‌-విత్‌డ్రావబుల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. దానిపై వచ్చే వడ్డీ రూ.15 లక్షలను స్పోర్ట్స్‌ పార్క్‌ నిర్వహణ పేరుతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి భార్య లక్ష్మి నేతృత్వంలోని కల్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల ట్రస్టుకు మళ్లించారు. ఇది ప్రభుత్వ మెమోలను స్పష్టంగా ఉల్లంఘించడమే.

సిమెంటు బెంచీల కొనుగోళ్లలో గోల్‌మాల్‌

చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తుడా సిమెంటు బెంచీల ఏర్పాటుకు నిర్ణయించింది. అప్పటి తుడా చైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2021-22లో తుడా టెండర్లు పిలిచి ఒక్కో బెంచీని సగటున రూ.8వేల చొప్పున 8500 బెంచీలను కొనుగోలు చేసింది. అదే సమయంలో ఆరు మండలాల ఎంపీడీవోలు తుడా నిధులతో 10 వేల బెంచీలను కొనుగోలు చేశారు. వీరు ఒక్కో బెంచీకి సగటున రూ.11వేలు ఖర్చు చేశారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎండీగా ఉన్న సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ద్వారా రూ.11.50 కోట్ల విలువైన బెంచీలు సరఫరా అయ్యాయి. ఒక సిమెంటు బెంచీ అసలు ధర సుమారు రూ.3వేలు మాత్రమే. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి సుమారు రూ.15 కోట్లు ఆదా అయ్యేవి.


రోజుకు 1100 కి.మీ. ప్రయాణం

2019-24 మధ్య తుడా నిధులను ఐదు వాహనాల ఇంధనానికి సుమారు రూ.2.15 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన భాస్కర రెడ్డి తన అధికారిక పర్యటనలలో సగటున రోజుకు 1100 కి.మీ. ప్రయాణించినట్టు లెక్క.

రికార్డుల్లో ఏవీ?

2019-24 మధ్య తుడా నుంచి గురు ప్రింటర్స్‌కు రూ.1.08 కోట్లు చెల్లించారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండరు ద్వారా ప్రధానంగా 6 లక్షల గృహ సమాచార సెట్లు, 2 లక్షల ఎగ్జామ్‌ ప్యాడ్స్‌, 2వేల బాల్‌పాయింట్‌ పెన్నుల సరఫరా కోసం పిలిచారు. ఇందులో తిరుపతికి చెందిన గురు ప్రింటర్స్‌ ఎల్‌1గా నిలిచింది. తుడా చైౖర్మన్‌ ఆదేశాల మేరకు ప్రింటు చేసిన డేటా షీట్లను గ్రామ వలంటీర్లకు అందించడంకోసం పంపిణీ చేశారు. వలంటీర్లు నిర్వహించిన ఆ సర్వేకు సంబంధించిన నివేదిక, ఫలితాలు, ఆ నివేదిక ఆధారంగా తీసుకున్న చర్యలు ఎక్కడా అధికారిక రికార్డుల్లో కనిపించలేదు.

మొక్కల పంపిణీలో చేతివాటం

తుడా పరిధిలోని ప్రతి ఇంటికీ రెండు పండ్లు, రెండు పూల మొక్కలను పంపిణీ చేయాలని చెవిరెడ్డి నిర్ణయించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో మొత్తం 15.50 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కల కొనుగోలు, పంపిణీ కోసం రూ.8.93 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉన్న ఇళ్ల సంఖ్యతో పోలిస్తే పంపిణీ చేసినట్లు చెబుతున్న మొక్కల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఏజెన్సీలకు చెల్లింపులు జరిగాయి. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు రశీదులపై సంతకాలు చేశారు.

తుడా నిధులతో విమాన ప్రయాణాలు

2019-24 మధ్యలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమాన ప్రయాణాల కోసం రూ.50 లక్షలు ఖర్చు చేశారు. 2018 జూలై నుంచి 2023 ఆగస్టు వరకు ఆయన 430 సార్లు విమాన ప్రయాణాల ఖర్చులను తుడా నిధుల నుంచి భరించారు. ఇందులో 334 సార్లు చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌ నగరాలకు వెళ్లినట్లు తేలింది. రెండు విదేశీ ప్రయాణాలు సైతం ఉన్నాయి. ఆయన అధికారిక పరిధికి వెలుపల ఈ ప్రయాణాలున్నట్టు నిర్ధారణ అయింది.

ఇష్టారాజ్యంగా నియామకాలు

2019-24లో తుడాలోని వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 36 మంది ఉద్యోగులను నియమించారు. విశ్రాంత ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా వీరికి కన్సాలిడేటెడ్‌ పే పైన తుడా వైస్‌ చైర్మన్‌ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అదనపు ఉద్యోగుల నియామకం ఎందుకు అవసరమైందనే విషయాన్ని ఎక్కడా రికార్డుల్లో పొందుపర్చలేదు.


ఆర్థిక నిర్వహణలో లోపాలు

తుడా నిధుల్లో అత్యధికశాతం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఖర్చు చేశారు. మొత్తం రూ.250 కోట్లలో ఏకంగా రూ.200 కోట్లు ఆరు మండలాల ఎంపీడీవోల ద్వారా ఖర్చు చేశారు. ఇందుకోసం పాత, కొత్త లేఅవుట్లలోని ప్లాట్లను వేలం ద్వారా విక్రయించి నిధులను సేకరించారు. ఆర్థిక నిర్వహణలో లోపాల వల్ల చివరకు ప్రభుత్వం నుంచి ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుడా నిధులను ఎంపీడీవోలు సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచకుండా నిబంధనలకు విరుద్ధంగా జాతీయేతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. ఈ నిధులపై వచ్చే వడ్డీని తమ ఇష్టానుసారంగా వినియోగించేందుకు ఇలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా చేశారు. ఎఫ్‌డీల ద్వారా మొత్తం రూ.7.17 కోట్లలో వడ్డీ వచ్చింది. ఇందులో రూ.6 కోట్లను చంద్రగిరిలో వైద్య శిబిరాల కోసం ఖర్చు చేశారు. ఇష్టానుసారం బిల్లులు చేశారు. మిగిలిన మొత్తాన్ని చెవిరెడ్డి తన వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించారు. వలంటీర్లకు వందనం, టీ-షర్టులు, మూడు రంగుల టోపీల ముద్రణ, క్రికెట్‌ టోర్నమెంట్‌ స్టిక్కర్లు వంటి కార్యక్రమాలకు వాడుకున్నారు.

సొంత భూముల్లో పనులు

2019-24 మధ్య చంద్రగిరి నియోజకవర్గం మినహా తుడా పరిధిలోని మిగిలిన 33 మండలాల్లో అభివృద్ధి పనులు జరగలేదు. కేవీబీపురం మండలంలో మాత్రం రెండు పనులు జరిగాయి. చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, ఆయన బావమరిది కాకనూరు నాగేశ్వరరెడ్డికి చెందిన కేవీఎస్‌ ఇన్‌ఫ్రాకు ఒల్లూరు, సిద్ధమనాయుడు కండ్రిగ గ్రామాల్లో 43.43 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ తుడా నిధులతో పనులు చేపట్టారు.

Updated Date - Jun 12 , 2026 | 04:49 AM