తిరుమలలో శాశ్వత క్యూలైన్‌కు టెండర్ ఖరారు
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:11 AM
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ ఏర్పాటుకు టీటీడీ ప్రతిపాదించింది.
బాటగంగమ్మ గుడి సర్కిల్ నుంచి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు ఏర్పాటు
తిరుపతి(టీటీడీ), జూన్ 5 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ ఏర్పాటుకు టీటీడీ ప్రతిపాదించింది. ఇక్కడ క్యూలైన్ ఏర్పాటుతోపాటు స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఖరారు చేసింది. పర్వదినాలతోపాటు సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ ఏర్పాటుకు, స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు రూ.12 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు టీటీడీ సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా టెండర్లు ఆహ్వానించగా నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో తిరుపతికి చెందిన ఏఎంఆర్‌డీ బిల్డర్స్, పీవీజీఎన్ బిల్డర్స్ సంస్థలు టెండరు నిబంధనల మేరకు ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత కమర్షియల్ బిడ్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో తెరిస్తే ఏఎంఆర్‌డీ బిల్డర్స్ సంస్థ రూ.8,25,48,722.84కే పనులు పూర్తి చేసేందుకు తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేసింది. అంటే ఏకంగా 8.90 శాతం మేరకు తక్కువకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థకు టెండరు ఇచ్చేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ వర్క్స్ కమిటీ చేసిన ప్రతిపాదనను టీటీడీ పాలకమండలి ఆమోదించింది.
దాతల సౌకర్యాల్లో మార్పులు
ప్రస్తుతం ఉన్న విరాళాల వ్యవస్థను, దాని ద్వారా దాతలకు లభించే ప్రివిలేజె్‌సను హేతుబద్ధీకరించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. విరాళాల విధానంలో ఏకరూపత తీసుకొచ్చేందుకు టీటీడీ ట్రస్టులు, వివిధ పథకాల కోసం ఒక సమగ్ర నగదు విరాళాల విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఈ అండ్ వై కన్సల్టెన్సీ ఒక ముసాయిదా ప్రతిని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో దాతల ప్రివిలేజ్ విధానంలో మార్పులు సూచించేందుకు అనుగుణంగా బోర్డు సభ్యులు ఎన్.సదాశివరావు, ఎ.మునికోటేశ్వరరావు, ఎం.శాంతారాం, టి.జానకీదేవి, జి.భానుప్రకా్‌షరెడ్డితో టీటీడీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న విధానాన్ని అధ్యయనం చేయడంతోపాటు మార్పులకు సంబంధించి వీరు సిఫారసులు చేయనున్నారు.
నేటి నుంచి ఎన్‌ఆర్‌ఐ భక్తుల దర్శనానికి 90 రోజుల గడువు
ప్రవాస భారతీయులకు శ్రీవారి దర్శనానికి 90 రోజుల గడువు విధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన భక్తులకు పాస్‌పోర్టు, వీసా ఆధారంగా టీటీడీ ప్రత్యేకంగా దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. నిర్దిష్టమైన కాల పరిమితి లేకపోవడంతో ఎన్‌ఆర్‌ఐ భక్తుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పాస్ట్‌పోర్టుపై స్టాంప్ పడిన 90 రోజుల్లోపు ‘ఎన్‌ఆర్‌ఐ కోటా’లో దర్శనం చేసుకోవచ్చంటూ శుక్రవారం రాత్రి టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఇది అమల్లోకి రానుంది.