సింఘాల్ దోషి!
ABN , Publish Date - May 01 , 2026 | 04:52 AM
తిరుమల తిరుపతి దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని సర్కారు నియమించిన రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ దినేశ్‌కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది.
కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితుల్ని ఈవోగా అనిల్‌కుమార్ అడ్డుకోలేకపోయారు
ఆయన హయాంలోనే నెయ్యి రూల్స్ సడలింపు
అయినా, బోర్డును ప్రశ్నించని సింఘాల్
రాష్ట్ర ప్రభుత్వానికి దినేశ్‌కుమార్ నివేదిక
ప్రొక్యూర్‌మెంట్ జీఎం,ఎఫ్ఏసీఏవోలదీ తప్పే
టీటీడీకి సరఫరా, పంపిణీ లోపరహితంగా ఉండాలి
బిడ్డింగ్‌లో నాణ్యతకే పెద్దపీట వేయాలి
సర్కారుకు రిటైర్డు సీఎస్ సూచనలు
సీబీఐ సిట్ నివేదికతో ఇప్పటికే సింఘాల్‌నుఈవోగా తొలగింపు.. పోస్టింగ్ ఇవ్వని సర్కార్
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సహా అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రిటైర్డు సీఎస్ దినేశ్‌కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. నెయ్యి నిబంధనలు సడలించడం ద్వారా కల్తీ నెయ్యి దందాకు వైసీపీ హయాంలో తెరలేపిన కాలంలో సింఘాలే ఈవోగా ఉన్నా, అడ్డుకోలేకపోయారని తేల్చింది. ఆయనతోపాటు అప్పటి ప్రొక్యూర్‌మెంట్ జీఎం, ఎఫ్‌ఏసీఏవోలను కమిషన్ దోషులుగా నిర్ధారించింది.
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని సర్కారు నియమించిన రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ దినేశ్‌కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. నెయ్యి టెండర్ల నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తే, వాటిని మరింత సులభతరం చేశారని వ్యాఖ్యానించింది. దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని తేల్చింది. దినేశ్‌కుమార్ గురువారం సాయంత్రం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ను కలిసి ఈ మేరకు నివేదికను సమర్పించారు. తిరుమల కల్తీనెయ్యి సరఫరా విషయంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. వీటి ఆధారంగా అసలు కల్తీనెయ్యి కేసులో అధికారుల పాత్ర ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ దినేశ్‌కుమార్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 20న జీవో 458 జారీ చేసింది.
45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, విచారణ సంక్లిష్టంగా ఉండటంతో మధ్యలో కమిషన్ విచారణ గడువును పొడిగించారు. దినేశ్‌కుమార్ విచారణ ఇప్పుడు కొలిక్కివచ్చింది. అనేక అంశాలపై సమగ్ర పరిశీలన చే సి నివేదిక రూపొందించి ఆయన ప్రభుత్వానికి అందించారు. నిబంధనల సడలింపు వల్లే కల్తీనెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో, ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. నిబంధనల సడలింపు ఉద్దేశ్యపూర్వకంగా చేసినా, చేయకపోయినా తప్పు అయితే జరిగిందని, దీని వల్లే కల్తీనెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈవోకు దిశానిర్దేశం చేయాల్సిన కొనుగోలు విభాగం వైఫల్యం ఉందని కూడా తెలిపినట్టు సమాచారం. నాటి కొనుగోలు విభాగం జనర ల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏసీఏవో) వైఫల్యాలు, త ప్పులు ఉన్నాయని కూడా నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దినేశ్‌కుమార్ సిఫారసు చేసినట్లు తెలిసింది. టీటీడీలో నెయ్యి సహా ఇతర కీలకమైన పదార్ధాల కొనుగోలు విధానం, టెండర్లు, నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తె లిసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఏది తక్కువ ధరకు లభిస్తే దాన్ని ఎంపిక చేయడం అన్ని అంశాల్లో సరైన పద్ధతి కాదని, అలా చేసినందువల్లే టీటీడీలో కల్తీనెయ్యికి ఆస్కారం ఏర్పడిందని క మిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి అత్యంత నాణ్యమైనదయి ఉండాలని, చీపెస్ట్, లోయెస్ట్ విధానాలను ప్రామాణికంగా తీసుకొని టెండర్లు నిర్వహిస్తే కల్తీ సరుకులు సరఫరా అయ్యే అవకాశం ఉందని ఈ ఉదంతం ప్రత్యక్షంగా నిరూపించిందని తెలిపింది. ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చి, నాణ్యతగల నెయ్యి సరఫరానే ప్రామాణికంగా తీసుకొనేలా టెండర్ నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇంకా కొనుగోలు, పాలన, విజిలెన్స్, పర్యవేక్షణ వంటి అనేక అంశాల్లో సమూల మార్పులు తీసుకురావాలని, జవాబుదారీని తీసుకొచ్చేలా విధానాలు అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తెలిసింది.
ఇదీ నేపథ్యం... సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 2015, మే 6న టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయనే ఈవోగా కొనసాగారు. 2020, సెప్టెంబరు 30 దాకా ఆయనే ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన స్థానంలోకి జగన్ ప్రభుత్వం ధర్మారెడ్డిని తీసుకొచ్చింది. నిజాయితీపరుడు, బాగా పనిచేస్తారు, సమర్థుడన్న పేరు అనిల్ సింఘాల్‌కు ఉంది. కానీ, ఆయన మౌనం, కీలక అంశాల్లో దేవస్థానం బోర్డు తీసుకునే నిర్ణయాలను అడ్డుకోలేకపోవడం, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రతిపాదనలను వ్యతిరేకించి అడ్డుకోలేకపోవడమే ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, (2019 తొలి నెలలు) సింఘాల్ ఈవోగా ఉన్న కాలంలోనే నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనలను కఠినరం చేశారు. అడ్డగోలు కంపెనీలు, పాల ఉత్పత్తి, సేకరణతో సంబంధం లేని సంస్థలు టెండర్లలో పాల్గొనకుండా కఠినమైన రూల్స్ తీసుకొచ్చారు. కానీ. జగన్ ప్రభుత్వం వచ్చాక, టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలోనే, అంటే 2020లో నెయ్యి కొనుగోలులో ఉన్న కఠినమైన నిబంధనలను సడలించారు. అంటే, పారదర్శకత, జవాబుదారీ ఆశించి 2019లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలను సడలించారన్నమాట! నెయ్యి సరఫరా చేసే కంపెనీలు పాల సేకరణే చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా రూల్స్‌ను బోర్డులో ఆమోదించారు. ఆ తర్వాత అమలు చేశారు. వీటిని అడ్డుకొనే అధికారం ఈవోకు ఉంది. ఎందుకంటే, అంతకుముందు ఏడాది, అంటే 2019లోనే కఠిన తరం చేసిన నిబంధనలను ఎందుకు ఇప్పుడు సులభతరం చేయాలని ప్రశ్నించే అధికారం ఈవోకు ఉంది. తీర్మానంలో డిస్సెంట్ (పూర్తి భిన్నాభిప్రాయం) వ్యక్తం చేసే అధికారం కూడా ఉంది. కానీ ఈవో నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని సీబీఐ సిట్ తేల్చింది. దీంతో నాటి పాలకమండలి కోరుకున్నట్లుగానే నెయ్యి కొనుగోలు నిబంధనల సడలింపు సజావుగా సాగిపోయిందని సిట్ చెప్పింది. సింఘాల్‌పై తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
కిం కర్తవ్యం?: సీబీఐ సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1న టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తప్పించింది. అదేరోజున ‘ఆంధ్రజ్యోతి’ ‘జగన్ ఖాతాలో మరో బలి’ శీర్షికన వార్తను ప్రచురించింది. ఇప్పటి వరకు సింఘాల్‌కు పోస్టింగ్ లేదు, వెయిటింగ్‌లోనే ఉన్నారు. దినేశ్‌కుమార్ విచారణ నివేదిక వచ్చాక ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని సర్కారు భావించింది. అయితే, ఈవోగా సింఘాల్ ఉండగా జరిగిన నిబంధనల సడలింపు వల్లే కల్తీనెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఆయన సరైన శ్రద్ధ, బాధ్యతగల పర్యవేక్షణ చూపలేదని దినేశ్ కుమార్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కల్తీనెయ్యి కేసులో ఆయన పాత్ర ఉందని ఇప్పుడు దినేశ్‌కుమార్ నివేదిక ఇవ్వడంతో సింఘాల్‌పై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుంద న్న ఉత్కంఠ నెలకొంది.