డోలీ కట్టి.. నది దాటించి.. ఆస్పత్రిలో చేర్చినా..
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:29 AM
మారుమూల గిరిజన గ్రామం నుంచి 70 ఏళ్ల వృద్ధుడిని కుటుంబ సభ్యులు డోలీ కట్టి.. నది దాటించి అష్టకష్టాలు పడి ఆస్పత్రికి చేర్చినా అతడిని ప్రాణం దక్కలేదు. సీరియ్‌సగా ఉందని చెబుతున్నా..
వైద్యుల నిర్లక్ష్యానికి గిరిజనుడు బలి!
సీరియ్‌సగా ఉందని చెబుతున్నా పట్టించుకోని వైనం
మందులిచ్చి పంపేయడంతో మార్గమధ్యంలోనే మృతి
మృతదేహాన్ని నది దాటించలేక ఇవతలి ఒడ్డునే ఖననం
విజయనగరం జిల్లాలో ఘటన
మెంటాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామం నుంచి 70 ఏళ్ల వృద్ధుడిని కుటుంబ సభ్యులు డోలీ కట్టి.. నది దాటించి అష్టకష్టాలు పడి ఆస్పత్రికి చేర్చినా అతడిని ప్రాణం దక్కలేదు. సీరియ్‌సగా ఉందని చెబుతున్నా.. వైద్యులు తూతూ మంత్రంగా పరీక్షించి మందులిచ్చి పంపేశారని, వారి నిర్లక్ష్యం వల్లే తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా మెంటాడ మండలం లోతుగెడ్డ పంచాయతీ శివారు గిరిజన గ్రామం కొండపర్తి బాడవకు చెందిన అంజి సీతందొర (70) శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు డోలీలో సీతందొరను సుమారు కిలోమీటరు మేర పొదలు దాటుకుని, ఆ తర్వాత మరో కిలోమీటరు పొడవున తెప్పపై చంపావతి నది దాటి.. కొండపర్తి చేరుకున్నారు. అక్కడి నుంచి 108లో గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. డ్యూటీ వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. రోగం నయం అవ్వకపోతే పదిరోజుల తరువాత రావాలని చెప్పారు. దగ్గు, ఆయాసం, ఎగ ఊపిరి ఎక్కువగా ఉన్నందున కుటుంబ సభ్యులు మళ్లీ వైద్యసిబ్బందిని సంప్రదించారు.
అదేమీ పెద్ద సీరియస్ కేసు కాదని, మందులు వేసుకుంటే తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి తిరిగి గ్రామానికి వెళ్లే క్రమంలో ఆటోలో మళ్లీ కొండపర్తి వరకు రాగా.. మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. అయితే, మృతదేహాన్ని నదిలో తెప్పపై దాటించడం సాధ్యం కాలేదు. గత్యంతరం లేక చంపావతినది ఈవల ఒడ్డున కొండపర్తిలోనే సీతందొర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే తన తండ్రి ప్రాణం తీసిందని కుమారుడు ఎర్రన్న దొర ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు