తిరుపతిలో డీజీపీల సదస్సు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:17 AM
రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్లకు సమగ్ర విధానం తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్ల మంజూరుకు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఫీజులు కూడా ఆయా వర్సిటీలే నిర్ణయించుకుంటున్నాయి.
డిసెంబరు 4 నుంచి 6 వరకూ నిర్వహణ
ప్రధాని మోదీ, అమిత్ షా రాక
ఏర్పాట్లపై సీఎస్ సమన్వయ సమావేశం
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): దేశ అంతర్గత భద్రతపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐబీ అధికారులు పాల్గొనే అత్యున్నత సమావేశానికి తిరుపతి వేదిక కాబోతోంది. తిరుపతిలోని ఐఐఎస్ఈఆర్‌లో డిసెంబరు 4 నుంచి 6 వరకూ ఈ సమావేశం జరగనుంది. ఈ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సోమవారం పోలీసు, ఇతర శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీజీపీల సమావేశానికి పటిష్ఠ ఏర్పా ట్లు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐబీ అధికారులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు 400 నుంచి 500 మంది పాల్గొనే అవకాశం ఉంది.
అందుకు అనుగుణంగా ఏర్పాట్లతో పాటు భద్రతాపరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని సీఎస్ స్పష్టం చేశారు. తిరుపతి నగర సుందరీకరణ, భద్రత, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో పూర్తి జాగ్రత్త వహించాలన్నారు. సమావేశ ప్రాంగణంలో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక సెల్ టవర్ ఏర్పాటు చేయాలని ఐటీ శాఖకు సూచించారు.
ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరైన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా భద్రతాపరమైన ఏర్పాట్ల పురోగతిని వివరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఏపీ క్యాడర్ అధికారులు ఈ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనాలని, కమిటీలో అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల ఏడీజీ మధుసూదన్ రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ పాల్గొన్నారు. టీటీడీ ఈవో రవిచంద్ర, తిరుపతి కలెక్టర్, ఎస్పీ వర్చువల్‌గా పాల్గొన్నారు.
మూడు రోజులు.. ఆరు అంశాలు
తిరుపతి కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగే జాతీయ అంతర్గత భద్రతా సదస్సులో ఆరు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల మధ్య సమన్వయం, నిఘా సమాచార మార్పిడి, సైబర్ నేరాల నెట్‌వర్క్ గుర్తింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్ ఛేదించడం, వ్యవస్థీకృత నేరాల కట్టడిపై అత్యంత కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి ఏపీ మీదుగా గంజాయి హైదరాబాద్, చెన్నైకి అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాలను ఇటీవల ఏపీలో పట్టుకున్నారు. ఈ అంశంపై సంబంధిత రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ పోలీసులు చర్చించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని ఇటీవల కిలోల కొద్ది ఏపీలో డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బెంగళూరు, హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న యువతీ యువకుల్ని కర్నూలు, విజయవాడ పోలీసులు గుర్తించారు.
ఉగ్ర, సైబర్ దాడులపై..
దేశ అంతర్గత భద్రతకు సంబంధించి పాకిస్థాన్ ఏజెంట్లు విశాఖపట్నంలోని మెరైన్ సిబ్బందికి ఎరవేసి గుట్టు లాగే ప్రయత్నం చేయడంతో ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టి ఎత్తుగడను అడ్డుకున్నాయి. వీటితో పాటు ప్రజల్ని నిలువునా దోచేస్తున్న సైబర్ మోసాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్