Share News

అమెరికా పార్కుల్లో ఆంధ్రా ముచ్చట్లు!

ABN , Publish Date - May 10 , 2026 | 04:29 AM

అమెరికాలోని తమ పిల్లల వద్దకు వచ్చే తెలుగువారు ముదిమి వయసులోనూ సరికొత్త స్నేహగీతాలు లిఖిస్తున్నారు. సాయంకాలంపూట స్థానిక పార్కుల్లో, కమ్యూనిటీ కేంద్రాల్లో కలుసుకుని కబుర్లు చెప్పుకొంటూ సేదతీరుతున్నారు.

అమెరికా పార్కుల్లో ఆంధ్రా ముచ్చట్లు!

ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల స్నేహగీతం

అటు వ్యాయామం.. ఇటు మానసికోల్లాసం

భారతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైనం

బాలింతల సంరక్షణ, పిల్లల పెంపకంలో తోడ్పాటు

మే-ఆగస్టు నెలల మధ్య అధికంగా అమెరికాకు...

(డల్లాస్‌ నుంచి కిలారు గోకుల్‌ కృష్ణ)

అమెరికాలోని తమ పిల్లల వద్దకు వచ్చే తెలుగువారు ముదిమి వయసులోనూ సరికొత్త స్నేహగీతాలు లిఖిస్తున్నారు. సాయంకాలంపూట స్థానిక పార్కుల్లో, కమ్యూనిటీ కేంద్రాల్లో కలుసుకుని కబుర్లు చెప్పుకొంటూ సేదతీరుతున్నారు. మే-ఆగస్టు నెలల మధ్య వీరు అత్యధిక సంఖ్యలో అమెరికాకు వస్తున్నారు. ఇండియాలో ఎండల తీవ్రత, అమెరికాలోని మనవల బడులకు సెలవులు కావడం దీనికి కారణం. పదవీ విరమణ చేసినవారితో పాటు ఉద్యోగస్తులు కూడా అమెరికా వస్తున్నారు. పిల్లలు ఆఫీసులకు వెళ్లిపోయాక ఇంట్లో ఒంటరిగా గడిపే వీరంతా సాయంకాలం స్థానికంగా ఒకచోట కలుసుకుని నడక, సైక్లింగ్‌ వంటి వ్యాయామాల్లో పాల్గొంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు మానసికంగా ఆసరాగా నిలబడుతున్నారు. బయటకు ఒక్కరే వెళ్లలేకపోవడం, భాష సమస్య వంటి సవాళ్లకూ అమెరికా పార్కులు సమాధానమిస్తున్నాయి. నలుగురితో కలివిడిగా ఉండటం వల్ల సొంత నెట్‌వర్క్‌ ఏర్పడి పిల్లలమీద ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించుకుంటున్నారు. భిన్న భాషలు, భిన్న రాష్ట్రాల వారితో పరిచయాలు స్నేహాలుగా మారి.. రోజువారీ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలుగా విస్తరిస్తున్నాయి. వాట్సాప్‌ వంటి వేదికల ద్వారా ఈ సమూహాలు మరింత బలపడుతున్నాయి. నడక గ్రూపులు, పూజలు, పిక్నిక్‌లు, పరస్పర ఆహ్వానాలు వంటి కార్యకలాపాలు సాధారణంగా మారుతున్నాయి. దీనివల్ల విదేశంలో ఉన్నప్పటికీ ఒక ఆత్మీయ వాతావరణం ఏర్పడుతోంది. భారతదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికాకు వచ్చినప్పుడు మళ్లీ కలుసుకుంటున్నారు.


కార్పొరేట్‌ ఉద్యోగాల్లో ఉన్న ఎన్నారై దంపతులకు మాతృత్వ సెలవులు తక్కువగా ఉండటం, నవజాత శిశువుల డే-కేర్‌ సెంటర్లు, ఆలనాపాలన చూసే ఆయాల ఖర్చు భారీగా ఉండటంతో ఒక ఆరు నెలలు తల్లిదండ్రులు, మరో ఆరు నెలలు అత్తమామలు ఈ శిశువులు, బాలింతల సంరక్షణ చూసుకునేందుకు అధికసంఖ్యలో వస్తున్నారు. గ్రాడ్యుయేషన్లు, వివాహాలు, గృహప్రవేశాలు, ఆరోగ్య పరీక్షలు, టూరిజం వంటివి తర్వాతి స్థానాల్లో ఉంటున్నాయి. ఎదిగిన పిల్లలు ఉన్నవారు.. ఆయా చిన్నారులకు కథలు చెప్పడం, ఆటలు ఆడించడం, స్థానికంగా పర్యటించడం వంటివాటి ద్వారా బంధాన్ని బలపరుచుకుంటున్నారు. ఆరు నెలలు ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ వేలమైళ్ల ఆవల ప్రతిరోజూ ఇరుగుపొరుగుతో కొత్త పరిచయాలు పెంచుకుంటూ తెలుగుదనానికి దగ్గరగా జీవనం గడుపుతున్నారు.


స్థానిక కార్యక్రమాల్లో సందడి

అమెరికాకు వచ్చే తెలుగు ఎన్నారైల తల్లిదండ్రులు ఇంటికే పరిమితం కావట్లేదు. పరిచయాలు పెంచుకుని స్థానికంగా జరిగే భారతీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక బృందంగా ఏర్పడి కార్లు, బస్సుల్లో సభాప్రాంగణాలకు వెళ్లి సందడి చేస్తున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటు పండుగలు, యోగా, మాతృ భాషా దినోత్సవాలు కూడా సమష్టిగా జరుపుకుంటున్నారు.

ఏడాది ముందే ప్రణాళిక

అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఏడాది ముందే తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకుని, విమాన టికెట్లు కొంటున్నారు. అప్పటి నుంచి ప్రయాణ తేదీకి మధ్య జరిగే అంతర్జాతీయ పరిణామాలు వీరిపై ప్రభావం చూపట్లేదు. ఉద్యోగస్థుల మాదిరి కాకుండా ప్రయాణ తేదీల్లో పూర్తి వెసులుబాటు ఉండటంతో టికెట్లపై విమానయాన సంస్థలు చేసే మార్పులను సైతం వీరు స్వాగతిస్తున్నారు. క్యాన్సిలేషన్‌ ఫీజు లేకపోవడం, ధరలో మార్పు లేకుండా టికెట్‌ మార్చుకోగలిగే అవకాశాలు సానుకూల అంశాలుగా ఉంటున్నాయి.

యువకుల కన్నా చురుగ్గా ఉంటున్నారు

-భాను మాగులూరి, ఎన్నారై పేరెంట్స్‌

అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు, వర్జీనియా

తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్నారైల తల్లిదండ్రులు స్థానిక యువత కన్నా చురుగ్గా ఉంటున్నారు. ఫలానా చోట కార్యక్రమం అంటే స్వయంగా రవాణా ఏర్పాట్లు చేసుకుని మరీ పాల్గొంటున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు అమెరికా నుంచి సంఘీభావం తెలపడంలో వీరు ముందువరుసలో ఉన్నారు. డీసీలోని భారత ఎంబసీ వద్ద జాతీయ దినోత్సవాలు నిర్వహించినప్పుడు వారి సందడి ఆకట్టుకుంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో అతిథులుగా హాజరవుతున్నారు. వేడుకల్లో పాల్గొనేవారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు బస్సులు ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి.


ఎక్కడైనా తల్లిదండ్రులదే కీలక పాత్ర

‘‘డల్లాస్‌ పరిసర ప్రాంతమైన లిటిల్‌ ఎల్మ్‌లో పర్యటిస్తున్న ఎన్నారైల తల్లిదండ్రులు కలిసి ‘స్పిరిటాస్‌ రాంచ్‌ వాకర్స్‌ క్లబ్‌’ ఏర్పాటు చేసుకున్నారు. 55మంది సభ్యులున్న ఈ క్లబ్‌లో రోజూ ఉదయం, సాయంత్రం నడకతో పాటు కుటుంబ విశేషాలు, రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించుకుంటున్నారు. ‘ఇండియాలోనైనా, అమెరికాలోనైనా కుటుంబ సంరక్షణలో తల్లిదండ్రులదే కీలక పాత్ర. తదుపరి తరంతో అనుబంధం కోసం అమెరికాలో పర్యటిస్తున్నామ’ని క్లబ్‌ సభ్యులు శ్యామ్‌రావు, కృష్ణారెడ్డి, ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - May 10 , 2026 | 04:31 AM