Share News

కార్యకర్తలకు అందలం

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:36 AM

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవుల భర్తీలో పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు 150 మందికి ఈసారి అవకాశం దక్కనుంది.

కార్యకర్తలకు అందలం

150 మందికిపైగా నామినేటెడ్‌ పోస్టులు

పార్టీ ఇచ్చిన 6 కార్యక్రమాల్లో పనితీరే ప్రామాణికం

ఈసారి కార్యకర్తే అధినేత అన్న లోకేశ్‌ పిలుపు సాకారం చేస్తూ నిర్ణయం

(అమరావతి - ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవుల భర్తీలో పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు 150 మందికి ఈసారి అవకాశం దక్కనుంది. ‘కార్యకర్తే అధినేత’ అంటూ కడప మహానాడు వేదికగా టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్‌ ఇచ్చిన పిలుపును సాకారం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబరులో తొలి విడత నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేపట్టింది. 20 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లుగా 86 మందిని నియమించింది. అదే ఏడాది నవంబరులో రెండో విడత పదవులను భర్తీ చేసింది. 59 కార్పొరేషన్లకు 62 మందిని నియమించారు. మొత్తం 148 మంది పదవీకాలం ఈ ఏడాది చివరికి ముగియనుంది. రెండేళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్న వారికి పొడిగింపు ఇవ్వకూడదని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో మరొకరికి పదవి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అప్పట్లో రెండు విడతల్లోనూ నామినేటెడ్‌ పదవుల భర్తీలో.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోరాడినవారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి నామినేటెడ్‌ పదవుల భర్తీలో పనితీరును ప్రామాణికంగా తీసుకుని కార్యకర్తలకు అగ్ర తాంబూలం ఇవ్వనున్నారు.


పనితీరును ఎలా గుర్తిస్తారు?

కార్యకర్తల పనితీరును గుర్తించేందుకు పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. 2024లో పిలుపునిచ్చిన.. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’, పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీఎత్తున చేపట్టినసభ్యత్వ నమోదు కార్యక్రమం, గతేడాది జూలైలో చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం, ఈ ఏడాది జూలైలో ‘రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో చేపట్టిన కార్యక్రమంతోపాటు మొత్తం ఆరు కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల పనితీరు బేరీజు వేస్తారు. వాటిల్లో ఉత్తమ పనితీరు కనబర్చి అవార్డులు సాధించిన వారికి నామినేటెడ్‌ పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఆరు కార్యక్రమాల్లో ఐదింట మంచి పనితీరు కనబర్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటివారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మందిని పార్టీ అధిష్ఠానం గుర్తించింది. వారందరికీ ఈసారి నామినెటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేశ్‌ రూపకల్పన చేయగా, అధినేత చంద్రబాబు పరిశీలించి ఆమోదం తెలిపారు.

పొడిగింపునకు నో..

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్‌ పదవులు పొందినవారిలో కొంతమంది, తమను కొనసాగించాలని కోరుతున్నారు. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో సిఫారసులు చేయిస్తున్నారు. అయితే లోకేశ్‌ అందుకు నిరాకరించారు. ‘పార్టీ కోసం పనిచేసినవారు ఇంకా చాలామంది ఉన్నారు. వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా?’ అని చంద్రబాబు, లోకేశ్‌ తమ వద్దకు సిఫారసులతో వచ్చిన వారికి నిర్మొహమాటంగా చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:36 AM