Share News

మహానాడులో ‘యువగళం’ తీర్మానం

ABN , Publish Date - May 28 , 2026 | 04:54 AM

టీడీపీ మహానాడు కార్యక్రమంలో ‘యువగళం’ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మద్దతుగా పలువురు నేతల....

మహానాడులో ‘యువగళం’ తీర్మానం

  • ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ

  • మద్దతుగా నేతలు, కార్యకర్తల ప్రసంగాలు

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ మహానాడు కార్యక్రమంలో ‘యువగళం’ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మద్దతుగా పలువురు నేతలు, కార్యకర్తలు ప్రసంగించారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎండగట్టారు. ‘టీడీపీ అంటేనే ఒక చరిత్ర. ఆ చరిత్రను తిరగరాసే యువ సైన్యం మనది. మన యువనేత లోకేశ్‌ ‘యువగళం’ ప్రారంభించినప్పుడు.. వైసీపీ వాళ్లు పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేయకుండా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర జనం కోసం, జనం మధ్య నడిచిన లోకేశ్‌ను చూసి వైసీపీ సైకోల గుండెల్లో వణుకు పుట్టింది. యువశక్తికి అండగా నిలబడే ఏకైక జెండా పసుపు జెండా. టీడీపీ నాయకత్వం యువతకు 40 శాతం ప్రాధాన్యం ఇస్తూ రాజకీయాల్లోనూ పెద్దపీట వేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ అడుగు జాడల్లో నడుద్దాం. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములవుదాం’ అని గ్రీష్మ యువతకు పిలుపునిచ్చారు.

నాడు పెట్టుబడిదారులు పారిపోయారు

- అమర్నాథ్‌రెడ్డి

‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడి రాష్ట్రం నుంచి పారిపోయారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుపై నమ్మకంతో పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో లేపాక్షికి 8,841 ఎకరాలు ఇస్తే.. ఈరోజు వరకు ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడానికి జగనే కారణం. ఆ ప్రాజెక్టు మళ్లీ కార్యరూపం దాల్చాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యం’ అని ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి అన్నారు.


గత ఐదేళ్లూ రాక్షస పాలన: చైతన్య

‘రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు రాక్షస పాలన సాగింది. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, కల్తీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగించడంతో యువత దారితప్పారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన 1600 మంది బాలలు ఆత్మహత్యలు చేసుకున్నారు. డ్రగ్స్‌ రహిత ఏపీగా మార్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని టీడీపీ కార్యకర్త సి.చైతన్య అన్నారు.

సోషల్‌ మీడియాలో ఉద్యమం: ఆర్పీ

‘సోషల్‌ మీడియాలో వైసీపీ వాళ్లు చేస్తున్నది ఉద్యోగం. టీడీపీ చేస్తున్నది ఉద్యమం. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు జీతాలు తీసుకుని పనిచేస్తుంటే.. టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు లక్షలాదిమంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రతి మంచి పనిని సోషల్‌ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకువెళ్దాం.’ అని టీడీపీ కార్యకర్త కిరాక్‌ ఆర్పీ అన్నారు.

11.jpg

అప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా: దర్శిత్‌

‘చంద్రబాబును జైలులో పెట్టినప్పుడు, భువనమ్మను అవమానించినప్పుడు లేని ధర్మం.. వైసీపీ నాయకులకు ఇప్పుడు గుర్తుకు వస్తోందా? ఆలోచనల్లో చంద్రబాబు, నాయకత్వంలో లోకేశ్‌.. ఇద్దరూ జెన్‌-జీ లాంటివారు. జగన్‌ రాయలసీమను ఫ్యాక్షన్‌ సీమగా మారిస్తే.. లోకేశ్‌ ‘రాయల్‌’ సీమగా తీర్చిదిద్దుతున్నారు’ అని టీడీపీ కార్యకర్త పొట్లూరి దర్శిత్‌ అన్నారు.

3.jpg

విద్యా సంస్కరణలకు బాబు ఆద్యుడు: జ్యోత్స్న

టీడీపీ మహానాడు కేవలం ఒక సభ మాత్రమే కాదని, ఇది తెలుగుజాతి ఆలోచనలను పంచుకునే వేదిక అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్స అన్నారు. పేదల సేవలో అంశంలో భాగంగా ఆమె మహానాడులో ప్రసంగించారు. తెలంగాణ విద్యారంగం సంస్కరణల కోసం ఈ సభలో ప్రత్యేకంగా విద్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఏపీ విద్యారంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదని, నాడు చంద్రబాబు తెచ్చిన విద్యావిప్లవం.. నేడు తెలంగాణలో ఐటీ పురోగతికి ఎంతో దోహదం చేసిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మాటలు ఘనం.. ఫలితాలు శూన్యమని చెప్పారు.

Updated Date - May 28 , 2026 | 04:54 AM