Share News

ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందం..!

ABN , Publish Date - May 29 , 2026 | 04:45 AM

రాష్ట్రం ఆధునికత వైపు పరుగులు తీయాలి... అదే సమయంలో ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.

ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందం..!

  • టీడీపీ పాలనలో ఆలయాల అభివృద్ధి: మంత్రి ఆనం

రాష్ట్రం ఆధునికత వైపు పరుగులు తీయాలి... అదే సమయంలో ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. రెండో రోజు మహానాడులో ‘‘దేవాలయాల అభివృద్ధి-పరిరక్షణ’’ అంశంపై ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ కేవలం ఒక రాష్ట్రం కాదని... భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారమని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం సంపద కాదని... ధర్మంతో కూడిన సమృద్ధి, శక్తితో కూడిన శాంతి, విజ్ఞానంతో కూడిన వినయమని అన్నారు. నేడు సాంకేతికత విప్లవం మానవ జీవితాన్ని మారుస్తోందని అన్నారు. మన వేదాలు సత్యమేవ జయతే అని చెప్పాయని, అదే సత్యం పరిపాలనలో పారదర్శకంగా ఉండాలన్నారు. అదే ధర్మం రాజకీయాల్లో నైతికతలా మారాలన్నారు. ఇదే అంశంపై టీటీడీ బోర్డు మెంబర్‌ పనబాక లక్ష్మీ మాట్లాడుతూ... గొడ్డలి పార్టీ పాలనలో దేవాలయాలు ధ్వంసమయ్యాయని, తిరుపతి లడ్డూ అపవిత్రమైందని అన్నారు. తిరుపతిలో లడ్డూ తయారు చేసే పోటు కార్మికుల జీతాలను రూ.23 వేల నుంచి రూ.45 వేలకు పెంచామన్నారు. అర్చకుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ధూపదీప నైవేద్యం కింద చిన్న ఆలయాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచామన్నారు. యువగళం హామీ మేరకు వేద పండితులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇచ్చామని గుర్తుచేశారు.


2.jpg

చంద్రబాబుతో జగన్‌కు పోలికేంటి..!?

జగన్‌ది విధ్వంస పాలన.. వ్యవస్థల నిర్వీర్యం: అచ్చెన్న

ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ సీఎం జగన్‌కు పోలిక లేదని, ఆ స్థాయి వ్యక్తిత్వం ఆయనకు లేదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు అన్నారు. రెండో రోజు మహానాడులో... ‘‘విధ్వంసం నుంచి వికాసం వైపు’’ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే లక్ష్యంగా జగన్‌ పనిచేశారని మండిపడ్డారు. జగన్‌ విధ్వంస పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలను లోకేశ్‌ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. లోకేశ్‌ కాలి గోటికి కూడా జగన్‌ పనిచేయడని విమర్శించారు. జగన్‌ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయారని... నేడు సమర్థవంతమైన నేత చంద్రబాబును చూసి లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నారని... పోలవరం, అమరావతి శరవేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు.

3.jpg

కార్యకర్తలకు న్యాయం జరగాలి: కోటంరెడ్డి

‘‘విధ్వంసం నుంచి వికాసం వైపు’’ అంశంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ... విధ్వంసం అంచుల నుంచి రాష్ట్రం మళ్లీ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. మహిళలను గౌరవించడాన్ని కార్యరూపంలో చూపిస్తున్న నాయకుడు లోకేశ్‌ అని కొనియాడారు. రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు సముచిత గుర్తింపు, న్యాయం జరగాలని శ్రీధర్‌రెడ్డి కోరారు.

4.jpg

శాంతిభద్రతలే పునాదిగా విశ్వసించే పార్టీ టీడీపీ

ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి పాలన: పంచుమర్తి

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సామాజిక స్థిరత్వానికి పటిష్ఠమైన శాంతిభద్రతలే పునాది అని విశ్వసించే పార్టీ తెలుగుదేశమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. మహానాడులో ఆమె శాంతిభద్రతల అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. గత ఐదేళ్లూ అరాచక, గొడ్డలి పాలన కొనసాగితే ఇప్పుడు ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైసీపీ పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. ఇక మహిళలపై అత్యాచారాలకు అంతేలేదని, తన సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అత్యాచారం, హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్నారు. అమరావతి మహిళా రైతులపై అక్రమ కేసులు పెట్టి పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పించారన్నారు. అక్కను వేధించవద్దన్నందుకు అమర్‌నాధ్‌గౌడ్‌ను సజీవ దహనం చేసిన ఘటనలు వైసీపీ అరాచకానికి నిదర్శనమన్నారు. జై జగన్‌ అనలేదన్న కారణంతో పల్నాడులో తోట చంద్రయ్య హత్యకు గురయ్యాడన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టు పార్వార్డ్‌ చేసినందుకు 70 ఏళ్ల రంగనాయకమ్మపై అక్రమ కేసులు పెట్టారని, డీజీపీ నివేదిక ప్రకారం కూటమి ప్రభుత్వంలో అల్లర్లు, హత్యలు, కిడ్నా్‌పలు, గంజాయి కేసులు గణనీయంగా తగ్గాయన్నారు.

5.jpg

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

ప్రాంతీయ పార్టీలకు దారి చూపిన నేత: బండారు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అన్న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా గురువారం మహానాడులో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రెండోరోజు మహానాడు ప్రారంభంకాగానే చంద్రబాబు, లోకేశ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్‌ అని కొడియాడారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే 202 సీట్లతో విజయం సాధించి ప్రాంతీయ పార్టీలకు కొత్త దారి చూపిన నాయకుడు అని కొనియాడారు. ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ పేదల ఆహార భద్రత గురించి రూ.2కే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన దార్శనికుడు ఎన్టీఆర్‌ అన్నారు. ‘జోహర్‌ ఎన్టీఆర్‌ అనడం కన్నా.. జై ఎన్టీఆర్‌’ అనటమే తనకు నచ్చుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు టీడీ జనార్దన్‌ అన్నారు.

6.jpg

జగన్‌ పాలనలో అధ్వాన్నంగా రోడ్లు... ప్రమాదాల్లో 43 వేల మంది మృతి

ఐదేళ్ల జగన్‌ ఏలుబడిలో రోడ్లు దుర్భరంగా తయారయ్యాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. టీడీపీ మహానాడులో మౌలిక వసతులపై ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జగన్‌ ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, జలవనరులు, వ్యవసాయం శాఖలకు మూతవేశారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 45,378 కిలోమీటర్ల రోడ్లలో దాదాపు 50 శాతం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఆ ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 43 వేల మంది చనిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలోనే 5,050 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించి అభివృద్ధిలో వేగం పెంచిందని అన్నారు.

15.jpg

పారిశ్రామికవేత్తలు పారిపోయారు : మంతెన రామరాజు, ఏపీఐఐసీ చైర్మన్‌

గత ఐదేళ్లలో గొడ్డలి పార్టీ నాయకుల వేధింపులకు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు రాష్ట్రం విడిచి పారిపోయారని ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు చెప్పారు. టీడీపీ మహానాడులో మౌలిక సదుపాయాలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆయన మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని పోర్టుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో రూ. 29,252 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి మెగా షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందన్నారు.

Updated Date - May 29 , 2026 | 04:45 AM