Share News

ఆళ్లగడ్డ, మైదుకూరులో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:31 AM

నంద్యాల, కడప, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నాయకులపై ఆదివారం జరిగిన దాడులను టీడీపీ నేతలు ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు ఖండించారు.

ఆళ్లగడ్డ, మైదుకూరులో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు
rowdy

  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): నంద్యాల, కడప, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నాయకులపై ఆదివారం జరిగిన దాడులను టీడీపీ నేతలు ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు ఖండించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ‘నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో వైసీపీకి చెందిన బాబులాల్‌, బ్రాందీన్‌ నాయకత్వంలో 50 మంది రాళ్లు, రాడ్లతో విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో చాగలమర్రి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మౌలాలి, మరో నాయకుడు హనీఫ్‌ తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా మైదుకూరు పరిధిలోని బి.కొత్తపల్లిలో నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న టీడీపీ మద్దతుదారులపై వైసీపీ గూండాలు దాడి చేశారు. టీడీపీకి చెందిన ముత్తూరు రఘురాం తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు, వెనిగండ్లలో నామినేషన్‌ పత్రాల పరిశీలన సమయంలో అల్లర్లు సృష్టించారు. పోలీసులపైనే భౌతిక దాడికి ప్రయత్నించారు. పొన్నూరు.. అగతవరపాడులో వైసీపీకిచెందిన కొందరు టీడీపీ అభ్యర్థులను బెదిరించి భౌతికదాడులకు పాల్పడుతున్నారు’ అని టీడీపీ నేతలు ఎస్‌ఈసీకి వివరించారు.

Updated Date - Nov 23 , 2026 | 07:16 AM