హైకోర్టు దగ్గర హైడ్రామా
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:54 AM
హైకోర్టు దగ్గర శుక్రవారం హైడ్రామా నెలకొంది. చిట్ ఎగవేతదారు బాధితులకు డబ్బు కడతానని చెప్పడం.. దీంతో న్యాయమూర్తి బాధితులను, చిట్ యజమానులను కోర్టుకు రమ్మనడం..
హైకోర్టు దగ్గర హైడ్రామా
తణుకు చిట్స్ యజమానులను చుట్టుముట్టిన బాధితులు
దాడికి యత్నం.. రక్షణ కల్పించిన ఎస్పీఎఫ్.. తుళ్లూరు స్టేషన్‌కు తరలింపు
చిట్స్ యజమానుల బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి విముఖత
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): హైకోర్టు దగ్గర శుక్రవారం హైడ్రామా నెలకొంది. చిట్ ఎగవేతదారు బాధితులకు డబ్బు కడతానని చెప్పడం.. దీంతో న్యాయమూర్తి బాధితులను, చిట్ యజమానులను కోర్టుకు రమ్మనడం.. వందల సంఖ్యలో బాధితులు కోర్టుకు తరలిరావడంతో అక్కడంతా ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని దుర్గాభవాని చిట్స్ ఇరగవరం, తణుకు, పెనుమంట్ర, అత్తిలి మండలాల పరిధిలోని గ్రామాల ప్రజల నుంచి చిట్స్ రూపంలో కోట్ల రూపాయల సొమ్ము వసూలు చేసి బోర్డు తిప్పేసింది. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చిట్స్ యజమానులు, నిందితులైన గోలి శ్రీనివాసరావు, అతని కుమారుడు భవానీశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ ఇటీవల విచారణకు రాగా నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఫిర్యాదులో పేర్కొన్న సొమ్ము చెల్లించేందుకు నిందితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి నిందితులను, బాధితులను తమముందు హాజరుపర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తణుకు పోలీసులు బాధితులంతా కోర్టుకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో సుమారు 300మంది బాధితులు శుక్రవారం హైకోర్టుకు చేరుకున్నారు.
బెయిల్ పిటిషన్‌పై వాదనలు
నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా పోలీసుల తరఫున సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ... చిట్స్ పేరుతో తమను మోసం చేశారని 235 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వందల మంది హైకోర్టుకు చేరుకున్నారని, పిటిషనర్లు తమ సదుద్దేశాన్ని నిరూపించుకునేలా ఇప్పుడు కొందరికైనా సొమ్ము చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టుకు వచ్చిన వారిలో నిజమైన బాధితులు ఎవరో, నకిలీలు ఎవరో గుర్తించడం కష్టమన్నారు. పిటిషనర్లకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. ఏపీపీ స్పందిస్తూ నిందితులకు రక్షణ కల్పించవద్దని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ‘బాధితులు కొద్దిమంది ఉంటారని భావించి వారిని రమ్మన్నాం. తీరా చూస్తే తణుకు జనాభాలో సగం ఇక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో నిజమైన బాధితులెవరు? నకిలీలు ఎవరనేది తేల్చుకోవాల్సింది పిటిషనర్లే.
మేం ఎలాంటి రక్షణ కల్పించబోం. స్టేషన్‌కు వెళ్లి బాధితులతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారా? ఏం చేస్తారనేది మీ ఇష్టం’ అన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుముఖంగా లేమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభమయ్యాక నిందితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకొనేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు. అనంతరం కోర్టు వెలుపలకి వచ్చిన నిందితులు... బాధితుల కంట పడకుండా తప్పించుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే హైకోర్టు వెనుక గేటు నుంచి వెళ్లిపోతున్న నిందితులను బాధితులు గమనించి, వారిని అడ్డుకున్నారు. నిందితులపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. హైకోర్టు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో నిందితులను తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు