స్వర్ణాంధ్ర.. అవకాశాల గని!
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:51 AM
స్వర్ణాంధ్ర-2047 కేవలం అభివృద్థి రోడ్‌మ్యాపే కాదు.. ఇది అవకాశాలను సృష్టించడానికి, పౌరులను శక్తిమంతులను చేయడానికి, సాంకేతికతను వినియోగించుకోవడానికి, భారత్ అభివృద్థి చెందిన దేశంగా...
వికసిత్ భారత్-2047తో అనుసంధానించాం
నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం
న్యూఢిల్లీ, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర-2047 కేవలం అభివృద్థి రోడ్‌మ్యాపే కాదు.. ఇది అవకాశాలను సృష్టించడానికి, పౌరులను శక్తిమంతులను చేయడానికి, సాంకేతికతను వినియోగించుకోవడానికి, భారత్ అభివృద్థి చెందిన దేశంగా ఎదగడానికి గణనీయంగా సహకరించే.. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్మించే పరివర్తనాత్మక మిషన్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్-2047 సాధనకు కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఏపీ కట్టుబడి ఉందని, కేంద్రప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలిసి ఆ దిశగా పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు. గురువారమిక్కడ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీకి మొదట అభినందనలు తెలిపారు. అనంతరం.. ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ బ్లూప్రింట్‌ను వివరించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మించాలనే జాతీయ ఆశయానికి అనుగుణంగా ఈ దీర్ఘకాలిక అభివృద్థి వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047కు ఏపీ స్వర్ణాంధ్ర విజన్‌ను అనుసంధానం చేశామన్నారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీరు, ఇంధన భద్రత, అగ్రి టెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను ఇందులో భాగం చేశామని చెప్పారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా ఆధారిత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. పాలనా సంస్కరణలు, విధానాల స్థిరత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దూరదృష్టితో కూడిన ఆర్థిక అజెండా కారణంగా గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక వృద్థికి బాటలు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని.. భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
పాలనలో జవాబుదారీతనం..
సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనా నమూనాను ఏపీ అనుసరిస్తోంది. ఆర్టీజీఎస్, ఏఐ ఆధారిత విశ్లేషణలు వంటి ప్రెడిక్టివ్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఇంటిగ్రేటెడ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌ల ద్వారా ప్రజా పరిపాలన, పౌర సేవల పంపిణీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. 41 రకాల సమాచారాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తున్నాం. ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు ఇంటి వద్దనే అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికీ ఏడు ప్రాథమిక అవసరాలైన గృహనిర్మాణం, పారిశుధ్యం, కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు, వంటగ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. పీ-4 కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం.
సంతానోత్పత్తి రేటు పడిపోయింది..
జనాభాపరంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. భవిష్యత్‌లో ఆర్థిక, మానవ వనరుల కొరత ఏర్పడకుండా రాష్ట్రంలో జనాభా నిర్వహణ విధానాన్ని రూపొందిస్తున్నాం. జనాభా పెంపుపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరం.
సంజీవనితో డిజిటల్ హెల్త్ రికార్డులు..
ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు సంజీవని అనే వినూత్న కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య రక్షణ అందించడమే మా లక్ష్యం. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకూ సమూల సంస్కరణలు చేపట్టాం. ఏఐ ఆధారిత అభ్యాసం, పరిశ్రమలతో అనుసంధానించిన ఉన్నత విద్య, జీవనకాల అభ్యాస వ్యవస్థలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణపై ఆంధ్రప్రదేశ్ విద్య, నైపుణ్యాభివృద్థి వ్యూహాన్ని రూపొందిస్తోంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడల్‌తో విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలు పొందుతున్నారు. నైపుణ్యం వెబ్ పోర్టల్, పీఎం సేతు ద్వారా ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్ లాంటి రంగాల్లో యువతను సిద్థం చేస్తున్నాం. యోగా, ధ్యానం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మానవ వనరుల అభివృద్థిపై దృష్టిపెట్టాం.