50 శాతం దాటొద్దు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:49 AM
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించిన రాష్ట్రప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంచేసింది.
రిజర్వేషన్లపై మరోసారి తేల్చిచెప్పిన సుప్రీం
బీసీలకు 34శాతం కోటాపై ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
స్థానిక సంస్థల్లో బీసీలకు కోటాపై ప్రభుత్వానికి నిరాశే
హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం బెంచ్
ఏకీకృత కుటుంబ సర్వే ఏ చట్టం కింద చేశారు?
దానినెలా పరిగణనలోకి తీసుకుంటారు?
జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నలు
న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించిన రాష్ట్రప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టంచేసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 105, 1065 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రాష్ట్రప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వరుసగా 34 శాతం, 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవోలు 105, 1065 జారీ చేయడం.. న్యాయవాది తాండవ యోగేశ్ వాటిని సవాల్ చేయడం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే సామాజిక రిజర్వేషన్లు 50 శాతాన్ని మించుతున్నాయనే కారణంతో హైకోర్టు ఆ రెండు జీవోలను కొట్టివేయడం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఈ నెల 3వ తేదీన రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అన్నివేళలా వర్తింపజేయడం తప్పనిసరి నిబంధనేమీ కాదని తెలిపింది. నిర్దిష్టమైన సమాచారం ఉంటే రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి దాటొచ్చని సుప్రీంకోర్టే గతంలో తీర్పులిచ్చిందని పేర్కొంది. కేవలం అంచనాలతో రిజర్వేషన్ల జీవోలు తీసుకురాలేదని.. 2025 డిసెంబరు నుంచి సమగ్ర ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించి.. సామాజిక, ఆర్థికం, విద్య, ఉద్యోగం, నివాసం వంటి సమగ్ర వివరాలు సేకరించామని.. 2026 జూన్‌లో ఈ వివరాలను స్థానిక సంస్థల ముందుంచి ప్రజలు ధ్రువీకరించుకునే వెసులుబాటు కల్పించామని తన పిటిషన్‌లో తెలిపింది.
ఈ పిటిషన్ శుక్రవారం ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం సేకరించిన డేటాకు విశ్వసనీయత లేదంటూ తిరస్కరించడానికి ఎటువంటి కారణమూ లేదని రోహత్గీ అన్నారు. జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ‘ఇది యునైటెడ్ ఫ్యామిలీ సర్వే.. ఏ చట్టం కింద దీనిని చేశారు.. ఆ సర్వే డేటాను ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవచ్చో చెప్పండి. డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నామని జీవోల్లో ఎక్కడుంది’ అని ప్రశ్నించారు. హైకోర్టు చాలా సహేతుకమైన విధానాన్ని అనుసరించిందని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు