Share News

‘ఎస్సీ హోదా’పై రివ్యూ పిటిషన్‌ డిస్మిస్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 04:08 AM

ఎస్సీ హోదా వర్తింపు అంశానికి సంబంధించి గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాస్టర్‌ ఆనంద్‌ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న డిస్మిస్‌ చేసింది.

‘ఎస్సీ హోదా’పై రివ్యూ పిటిషన్‌ డిస్మిస్‌

  • పాస్టర్‌ ఆనంద్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

బాపట్ల, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఎస్సీ హోదా వర్తింపు అంశానికి సంబంధించి గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాస్టర్‌ ఆనంద్‌ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న డిస్మిస్‌ చేసింది. తీర్పుపై సమీక్ష కోరుతూ పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. దీంతో ఎస్సీ హోదా వర్తింపు అంశంలో ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అమలులో ఉండనుంది. 2021 జనవరి 24న అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగంగా ఉన్న పిట్టలవానిపాలెం మండల పరిధిలోని కొత్తపాలెంలో పార్థనలు నిర్వహించి వెళ్తుండగా తనపై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పాస్టర్‌ ఆనంద్‌ ఇచ్చిన ఫిర్యాదులోనే తాను క్రైస్తవుడినని తెలిపారని, మతం మారితే అట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి న్యాయపోరాటానికి దిగారు. షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు మతం మారిన తక్షణమే ఎస్సీ హోదా కోల్పోతారని 2025 ఏప్రిల్‌ 30న హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పాస్టర్‌ ఆనంద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ తీర్పుపైనే పాస్టర్‌ ఆనంద్‌ వేసిన రిప్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

Updated Date - Jul 19 , 2026 | 04:09 AM