స్థానిక పోరుకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:53 AM
‘‘ఓటరు జాబితా నవీకరణ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆ ప్రక్రియను సాకుగా చూపి రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల వాయిదా కుదరదు. ఈ విషయంలో నిరవధిక జాప్యం ఏ మాత్రం చట్టసమ్మతం కాదు. ఎన్నికలు జరగకుండా ఆటంకపరచడం అంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమే ...
‘సర్’ కోసం ఆగాల్సిన పనిలేదు: సుప్రీం
వైసీపీ పిటిషన్లు కొట్టివేత
ఎన్నికలకు ఆటంకమంటే ప్రజాప్రయోజనాలకు అడ్డే
నిరంతర జాప్యం చట్ట సమ్మతం కాదు
నోటిఫికేషన్ టైమ్‌కి ఏ జాబితా ఉంటే అదే ప్రామాణికం
సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
హైకోర్టు తీర్పునకు ధ్రువీకరణ
‘‘ఓటరు జాబితా నవీకరణ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆ ప్రక్రియను సాకుగా చూపి రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల వాయిదా కుదరదు. ఈ విషయంలో నిరవధిక జాప్యం ఏ మాత్రం చట్టసమ్మతం కాదు. ఎన్నికలు జరగకుండా ఆటంకపరచడం అంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమే అవుతుంది. జనాభా లెక్కలు, వార్డుల పునర్విభజన పూర్తి కాలేదనే కారణంతో ఎన్నికలను ఆపకూడదు. అవసరమైతే ఇప్పటికే అమల్లో ఉన్న పాత వార్డుల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియను చేపట్టవచ్చు.’’
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని ప్రయత్నించిన వైసీపీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘సర్’ (ఓటరు జాబితా సమగ్ర, ప్రత్యేక సవరణ) పేరుతో ఎన్నికలను వాయిదా వేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తద్వారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి ఏ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందో, అదే ప్రామాణికమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే, వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, కడప మాజీ మేయర్ పాక సురేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వీలైనంత త్వరగా, ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అక్టోబర్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారిద్దరూ వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ రెండు పిటిషన్లను కలిపి శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, సర్ విషయమై సర్వోన్నత న్యాయస్థానం స్పష్టతనిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే నాటికి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అధికారికంగా పూర్తి కాకపోతే, అప్పటికే అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికలను వాయిదా వేయడం ప్రజా ప్రయోజనాలకు భంగకరం అవుతుందని స్పష్టం చేసింది.
కొత్త జాబితా ఆధారంగానే ఎన్నికలు జరపాలి : వైసీపీ
పిటిషనర్ పాక సురేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ‘‘‘సర్’ ప్రక్రియ ఈ నెల 16 నాటికి పూర్తవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాబట్టి కొత్త జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించండి.’’ అని ఆర్యమ సుందరం వాదించారు. లేళ్ల అప్పిరెడ్డి తరఫున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధం. జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన చట్టబద్ధంగా పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలి. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశించాలి.’’ అని నిరంజన్ రెడ్డి కోరారు.
కొత్తది వచ్చేదాకా పాత జాబితానే పరిగణన: ఈసీ
తుది సర్ జాబితా ప్రచురించిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే, సవరించిన ఓటరు జాబితాలే వర్తిస్తాయనే అంశాన్ని ఎస్‌ఈసీ వ్యతిరేకిస్తోందా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్ అలాగేమీ లేదని తెలిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి తాము ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, చట్ట నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని కోర్టుకు విన్నవించారు. ఈసీఐ కొత్త జాబితా ప్రచురించేవరకు అమల్లో ఉన్న ఓటరు జాబితానే వర్తిస్తుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాల తయారీని నియంత్రించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం, 1994, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1995లోని సంబంధిత నిబంధనలను ధర్మాసనం పరిశీలించింది. వాదనలు, చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏపీ పంచాయతీరాజ్ చట్టం (1994), మున్సిపల్ చట్టం (1995) లోని సెక్షన్ 11, 12 నిబంధనలను ఉటంకిస్తూ తుది తీర్పును వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఈ కొత్త జాబితా అందుబాటులో ఉంటే దానినే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అప్పటికి సర్ ప్రక్రియ పూర్తికాకపోతే, అందుబాటులో ఉన్న జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను నిరాటంకంగా నిర్వహించాలని బెంచ్ ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు