Share News

మూడు రోజుల్లో మారిన చిత్రం

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:18 AM

మొన్నటి వరకు ఇసుక దిబ్బలతో వెలవెలబోయిన జలాశయం ఒక్కసారిగా నిండుకుండలా మారింది. మూడు రోజుల్లోనే చిత్రం మారిపోయింది. ఈ సీజన్‌లోనే రెండోసారి పూర్తిగా నిండింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన

మూడు రోజుల్లో మారిన చిత్రం

  • సుంకేసులకు 1.026 టీఎంసీలు.. సీజన్‌లో రెండోసారి పూర్తిగా నిండిన జలాశయం

కర్నూలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మొన్నటి వరకు ఇసుక దిబ్బలతో వెలవెలబోయిన జలాశయం ఒక్కసారిగా నిండుకుండలా మారింది. మూడు రోజుల్లోనే చిత్రం మారిపోయింది. ఈ సీజన్‌లోనే రెండోసారి పూర్తిగా నిండింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి మళ్లీ జలకళ వచ్చింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా.. శనివారం సాయంత్రం నాటికి 1.026 టీఎంసీల నిల్వ చేరింది. 11 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో కేసీ కెనాల్‌కు 2,500 క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ సీజన్‌లో కేసీ కెనాల్‌కు తొలిసారిగా నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం జూన్‌లో వచ్చిన వర్షాలకు ఒకసారి సుంకేసుల జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. అయితే ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు లేకపోవడం, తుంగభద్ర డ్యామ్‌ గేట్లేత్తి దిగువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి తలెత్తింది. 6.50 లక్షల జనాభా కలిగిన కర్నూలు నగరానికి తాగునీటి సరఫరాతో పాటు ఎండ తీవ్రతకు సుంకేసుల అడుగంటి ఇసుక మేటలు తేలాయి. ఫోర్‌షోర్‌ ఏరియాలో నీళ్లు లేక వెలవెలబోయింది. ఈ క్రమంలో కర్నూలు నగర ప్రజలకు తాగునీటి సరఫరాకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోనే కాకుండా తుంగభద్ర నదీ తీర పరివాహక ప్రాంతాలు, హగరి (వేదవతి) నదీ తీర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్రకు వరద మొదలైంది. శుక్రవారం ఆర్డీఎస్‌ ఆనకట్ట ఉప్పొంగింది. మంత్రాలయం దాటుకొని సాయంత్రానికి సుంకేసులకు వరద చేరింది. ఈ సీజన్‌లో సుంకేసుల రెండోసారి పూర్తిగా నిండటంతో పర్యాటకుల తాకిడి మొదలైంది. కర్నూలు నగరానికి తాగునీటి గండం తప్పిందని నిపుణులు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:18 AM