జడ్పీటీసీ 245.. ఎంపీటీసీ 2,949
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:17 AM
Highest number of nominations on the final day జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు పోటెత్తాయి. ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం, వైసీపీ చెరో 1,248 నామినేషన్లు దాఖలు చేసి సమవుజ్జీలుగా నిలిచాయి. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది.
జిల్లాలో చివరిరోజు పోటెత్తిన నామినేషన్లు
ఎంపీటీసీలకు టీడీపీ, వైసీపీ నుంచి సమానంగా నామినేషన్లు
నేటి నుంచి పరిశీలన.. ఆతర్వాత ఉపసంహరణ
శ్రీకాకుళం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు పోటెత్తాయి. ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం, వైసీపీ చెరో 1,248 నామినేషన్లు దాఖలు చేసి సమవుజ్జీలుగా నిలిచాయి. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. శనివారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.
జడ్పీటీసీ స్థానాలకు 245 నామినేషన్లు
జిల్లాలోని 30 జడ్పీటీసీ స్థానాలకు 245 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా తెలుగుదేశం పార్టీ నుంచి 87 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి 76 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన పార్టీ నుంచి 32 మంది, బీజేపీ నుంచి 23 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 14, సీపీఐ(ఎం) నుంచి 5 నామినేషన్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా 8 మంది నామినేషన్లను సమర్పించారు.
ఎంపీటీసీ బరిలో హోరాహోరీ
542 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,949 నామినేషన్లు దాఖలవడం ఎన్నికల వేడిని సూచిస్తోంది. ఆసక్తికరంగా ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ నుంచి 1248 నామినేషన్లు దాఖలు కాగా, వైసీపీ నుంచి కూడా 1248 దాఖలు కావడం విశేషం. జనసేన నుంచి 220, బీజేపీ నుంచి 105 నామినేషన్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా 102 మంది నామినేషన్లను వేశారు. కాంగ్రెస్ నుంచి 12, సీపీఐ (ఎం) 10, బీఎస్పీ నుంచి 2, ఇతర పార్టీల నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి.
నేటి నుంచి పరిశీలన
శనివారం నుంచి అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నిబంధనల మేరకు లేనివి, అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను తిరస్కరించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
ప్రశాంతంగా నామినేషన్లు : ఎస్పీ
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేశాం. పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నాం. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంద’ని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ, డీఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
సంప్రదించాల్సిన నెంబర్లు
----------------
జిల్లా పోలీస్ కంట్రోల్‌రూమ్ 63099 90933
జిల్లా పోలీస్ ఎన్నికల సెల్ 63099 90923
శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం 63099 90804
కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం 63099 90805
టెక్కలి డీఎస్పీ కార్యాలయం 63099 90811