Share News

జిప్‌లు ఊడి.. హ్యాండిల్స్‌ తెగి

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:28 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ల పేరుతో పంపిణీ చేసిన చాలా బ్యాగుల్లో నాణ్యత కొరవడింది.

జిప్‌లు ఊడి.. హ్యాండిల్స్‌ తెగి
చిరిగిపోయిన బ్యాగ్‌

- విద్యార్థులకు అందించిన స్కూల్‌ బ్యాగ్‌ల్లో నాణ్యత కరువు

- రెండు నెలలకే చిరిగిన వైనం

- వెనక్కి ఇచ్చేస్తున్న పిల్లలు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ల పేరుతో పంపిణీ చేసిన చాలా బ్యాగుల్లో నాణ్యత కొరవడింది. విద్యార్థులకు అందించిన రెండు నెలలకే అవి చిరిగిపోతున్నాయి. జిప్‌లు ఊడిపోవడంతో పాటు హ్యాండిల్స్‌ తెగిపోతున్నాయి. దీంతో కొందరు విద్యార్థులు వాటిని వెనక్కి ఇచ్చేస్తుండగా, మరికొందరు కుట్లు వేయించి వినియోగిస్తున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో 2015 ప్రాథమిక, 151 ప్రాథమికోన్నత, 450 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,53,918 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ విద్యార్థి మిత్ర కిట్లు అందించాల్సి ఉంది. కానీ జిల్లాలో ఈ ఏడాది దాదాపు 70శాతం మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు అందించిన బ్యాగ్‌ల్లో కొన్ని నాశిరకంగా ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. చాలా బ్యాగులు లోపల ఇన్నర్‌ లేకుండా ఉన్నాయి. మరికొన్ని బ్యాగ్‌లకు హ్యాండిల్స్‌ ఊడిపోగా, కొన్నింటికి విద్యార్థులు భుజానికి వేసుకునే బెల్టులు తెగిపోయాయి. ఇచ్చిన వారం రోజులకే కొన్ని బ్యాగ్‌లకు కుట్లు ఊడిపోయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థి మిత్ర కిట్ల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తున్నా.. పర్యవేక్షణ లేకపోవడంతో నాశిరకం బ్యాగ్‌లు పంపిణీ చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈఏడాది పంపిణీ చేసిన బ్యాగ్‌ల్లో చాలా వరకు పాతవేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తలలు పట్టుకుంటున్న హెచ్‌ఎంలు..

విద్యార్థులకు అందించిన బూట్లలో కూడా కొన్ని పెద్దవిగా, మరికొన్ని చిన్నవిగా ఉన్నాయి. ఈ బూట్ల సరిపోకపోవడంతో విద్యార్థులను పలుమార్లు మండల రిసోర్స్‌ కేంద్రాలకు తీసుకెళ్లి వారి సైజ్‌ గల బూట్లను ఉపాధ్యాయులు తీసుకువెళ్లారు. అదే విధంగా ఒక్కొక్క పాఠశాలకు 20శాతం నుంచి 40శాతం వరకు చిరిగిన బ్యాగులు, బెల్టులు లేనివి, కుట్లు ఊడిపోయినవి వచ్చాయి. వీటిని విద్యార్థులకు పంపిణీ చేసేందుకు హెచ్‌ఎంలు తలలు పట్టుకున్నారు. పైతరగతి చదివే విద్యార్థులకు మినహాయించి కింది తరగుతులు చదివే విద్యార్థులకు పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలల్లో చిరిగిన బ్యాగ్‌లను మండల రిసోర్సు కేంద్రాలకు తిరిగి అప్పగించారు. కొందరు ఎంఈవోలు వాటిని తీసుకొని కొంతమేర బాగున్న బ్యాగ్‌లను అందించారు. ఈ విషయంపై సర్వశిక్షాభియన్‌ ఏపీసీ వేణుగోపాలరావును వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది.

Updated Date - Aug 20 , 2026 | 12:28 AM