గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిపై వైసీపీ నేత దాడి
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:02 AM
YSRCP leader attack కవిటిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిపై వైసీపీ నేత దాడి చేశాడు. దీంతో ఆ నేత తీరును నిరసిస్తూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకూ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
సిలిండర్ల సరఫరా నిలిపివేసిన సిబ్బంది
కవిటి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కవిటిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడిపై వైసీపీ నేత దాడి చేశాడు. దీంతో ఆ నేత తీరును నిరసిస్తూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకూ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కవిటిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి శుక్రవారం గొండ్యాలపుట్టుగ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దుద్ది ధర్మారావు(ఎంపీటీసీ భర్త)తో పాటు కుమారుడు అజయ్ మరికొందరు వచ్చారు. తమ గ్రామానికి చెందిన వారికి త్వరగా గ్యాస్ ఇవ్వాలని, ఆన్‌లైన్ పేమెంట్ కాకుండా నగదు తీసుకుని ఇవ్వాలని ధర్మారావు వాగ్వాదానికి దిగాడు. ప్రభుత్వం, గ్యాస్ కంపెనీల నిబంధనల మేరకే తాము సరఫరా చేస్తామని నిర్వాహకుడు వెంకటరావు బదులిచ్చాడు. దీంతో వైసీపీ నాయకుడు ధర్మారావు.. వెంకటరావు షర్టు పట్టుకుని బయటకు లాక్కుని వచ్చి పిడిగుద్దులతో భౌతికదాడి చేశాడు. ఏజెన్సీ సిబ్బంది వీడియో తీస్తుండగా వారిపై కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ పుటేజీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని వెంకటరావు కవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రవివర్మ తెలిపారు.
న్యాయం చేసేవరకూ.. నిలుపుదల
‘గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో చొరబడి.. తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. తమకు న్యాయం చేసేవరకూ గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నామ’ని నిర్వాహకుడు వెంకటరావు, సిబ్బంది తెలిపారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మండలంలోని పలువురు వినియోగదారులు అవస్థలు పడ్డారు.