Share News

చెరువులోపడి యువకుడు మృతి

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:15 AM

రావిచెంద్రి గ్రామంలోని స్నానాల చెరువులోపడి నేల మోహన్‌ (16) గురువారం మృతిచెందాడు.

చెరువులోపడి యువకుడు మృతి
మోహన్‌ మృతదేహం

ఎల్‌ఎన్‌ పేట, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రావిచెంద్రి గ్రామంలోని స్నానాల చెరువులోపడి నేల మోహన్‌ (16) గురువారం మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. మోహన్‌ తల్లిదండ్రులు జగన్‌, చిట్టి విశాఖలోని జ్ఞానాపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓంకార్‌, మోహన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓంకార్‌ విశాఖలో డిప్లమో చదువుతుండగా.. మోహన్‌ ఈ ఏడాది టెన్త్‌లో ఉత్తీర్ణుడై విశాఖలోనే ఐటీఐ చదువుతున్నాడు. ఈ క్రమంలో రావిచెంద్రి గ్రామంలో తన స్నేహితుడు సోమేష్‌ రెండో కుమారుడు పుట్టినరోజు వేడుకలకు విశాఖ నుంచి తన సోదరుడు ఓంకార్‌తోపాటు మరో 10మంది స్నేహితులతో కలిసివచ్చాడు. మధ్యాహ్నం భోజనాలు తరువాత స్నేహితులతో కలిసి స్నానాల కోనేరు వద్దకు వచ్చి చెరువులోకి మరొక స్నేహితుడి కలిసి మోహన్‌ దిగాడు. మోహన్‌ ఈదుకుంటూ చెరువు మధ్యలో ఉన్న రాధాకృష్ణుల విగ్రహం వద్దకు వెళ్లి తిరిగి ఒడ్డుకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన తనతోటి స్నేహితులు గ్రామస్థుల సాయంతో మోహన్‌ను ఒడ్డుకు చేర్చి ఎల్‌ఎన్‌ పేట సీహెచ్‌సీకి ఆటోలో తీసుకురాగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారి జీవేశ్వరరావు తెలిపారు. విషయం తెలుసుకున్న సరుబుజ్జిలి పోలీసులు హాస్ప టల్‌ వద్దకు చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృత దేహాన్ని భద్రపరచేందుకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని, ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని హెచ్‌సీ రమేష్‌ తెలిపారు.

Updated Date - Sep 04 , 2026 | 12:16 AM