Share News

కాశీబుగ్గలో కలకలం

ABN , Publish Date - May 10 , 2026 | 12:26 AM

Attacked with knife కాశీబుగ్గలోని ఓ మొబైల్‌షాపులో పనిచేస్తున్న యువకుడిపై ఇద్దరు వ్యక్తులు చాకుతో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాశీబుగ్గలో కలకలం
బాధితుడు ఈశ్వరరావు నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ వై.రామకృష్ణ

  • యువకుడిపై చాకుతో దాడి..

  • ఆపై పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

  • ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమన్న పోలీసులు

  • ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న బాధితుడు

  • పలాస, మే 9(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గలోని ఓ మొబైల్‌షాపులో పనిచేస్తున్న యువకుడిపై ఇద్దరు వ్యక్తులు చాకుతో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

  • కాశీబుగ్గ కేటీ రోడ్డులోని ఓ మొబైల్‌షాప్‌లో పనిచేస్తున్న లోలుగు ఈశ్వరరావు అనే యువకుడ్ని రాజమ్మకాలనీకి(29వ వార్డు) చెందిన రాజాం తిరుపతిరావు, కోడ సురేష్‌ బయటకు పిలిచి వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయన్ను బయటకు ఈడ్చి.. మెడపై చాకుతో దాడిచేశారు. తర్వాత వారిద్దరూ కాశీబుగ్గ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయారు. కాగా.. రక్తపుమడుగులో ఉన్న ఈశ్వరరావును మొబైల్‌షాపు యాజమాని, స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్‌ చేశారు. సీఐ వై.రామకృష్ణ ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన చెప్పిన వివరాల మేరకు ఇరు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వ్యవహారమే ఈ సంఘటనకు కారణమని స్పష్టమవుతోంది.

  • ఈశ్వరరావు, ఆయనపై దాడి చేసిన తిరుపతిరావు.. ఇద్దరూ 29వ వార్డు రాజమ్మకాలనీకి చెందిన వారే. తిరుపతిరావుకి దగ్గర బంధువైన ఓ బాలికకు.. ఈశ్వరరావు సోదరుడు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తిరుపతిరావు కుటుంబ సభ్యులు కొన్నాళ్ల కిందట వారిద్దరినీ మందిలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ బాలికకు మరొకరితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందుకు బాలిక అంగీకరించలేదు. ఈక్రమంలో ఇటీవల బాలిక తండ్రి గుండెపోటులో మృతి చెందాడు. దీనికి ఈశ్వరరావు కుటుంబ సభ్యులే కారణమని భావించి.. వారిపై తిరుపతిరావు కక్ష పెట్టుకున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడు కోడ సురేష్‌తో కలిసి శనివారం మొబైల్‌షాపులో పనిచేస్తున్న ఈశ్వరరావుతో వాగ్వాదానికి దిగాడు. ఆపై చాకుతో మెడపై కోసి... దాడి చేశారు. ఈశ్వరరావు మృతి చెందాడని భావించి.. తిరుపతిరావు, సురేష్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

  • ఈ సంఘటనతో పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఈశ్వరరావు మెడపై చాకుతో కోయడంతో గొంతుకు భాగం వరకూ గాటు పడింది. మరో సెంటిమీటరు లోపలకు దిగిఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేదని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి వద్దకు బాధితుడి తల్లిదండ్రులు, కాలనీ ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - May 10 , 2026 | 12:26 AM