Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:28 AM

మందస మండలం కొర్రాయిగేటు బ్రిడ్జి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో వజ్రపుకొత్తూరు మండలం పూండిగో విందపురం గ్రామానికి చెందిన యువకుడు లావేటి మనోజ్‌(21) మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హరిపురం/ వజ్రపుకొత్తూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మందస మండలం కొర్రాయిగేటు బ్రిడ్జి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో వజ్రపుకొత్తూరు మండలం పూండిగో విందపురం గ్రామానికి చెందిన యువకుడు లావేటి మనోజ్‌(21) మృతిచెందాడు. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. మనోజ్‌ తన తండ్రి సూర్యనారాయణతో కలిసి కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోంపేటలో పనిచేసి ద్విచక్రవాహనంపై ఇంటికి చేరుకునే సమయంలో బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐరన్‌రైలింగ్‌ను ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై పడటంతో తలకు బల మైన గాయాలు తగిలి అక్కడకక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం సుమారు పదిమీటర్లు దూరంలో ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు మందస పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని హరి పురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్‌కి తల్లి గౌరి, తండ్రి సూర్యనారయణ, ఇంటర్‌ చదివే తమ్ము డు ఉన్నాడు. మనోజ్‌ మృతితో పూండిగోవిందపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

చికిత్స పొందుతూ మహిళ..

ఎచ్చెర్ల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట గ్రా మానికి చెందిన రీసు లక్ష్మి (45) ఈ నెల 18న గడ్డి మందు తాగి.. శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ 19వ తేదీ రాత్రి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీసు లక్ష్మి, పోతయ్య దంపతులకు కల్లు తాగే అలవాటు ఉంది. వీరి కుమార్తె దుర్గ, తన భర్తతో కలిసి కుప్పిలి నుంచి ఉగాది పండుగకు కన్నవారింటికి వచ్చింది. వీరి సమక్షంలో లక్ష్మి, పోతయ్యలు కల్లు తాగి గొడవ పడ్డారు. తల్లి లక్ష్మిని కుమార్తె దుర్గ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి గడ్డి మొక్కలను నివారించేందుకు తీసుకువచ్చిన మందును తాగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 19వ తేదీ రాత్రి మృతిచెందింది. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లక్ష్మి కుమారుడు రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ ఎస్‌.సింహాచలం తెలిపారు.

భవనంపై నుంచి జారిపడి వృద్ధురాలు..

శ్రీకాకుళం క్రైం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నగరంలో ఓ వృద్ధురాలు భవనంపై నుంచి కాలుజారి పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థా నికులు తెలిపిన వివరాల మేరకు.. న్యూ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అం తస్తులో కడరి సత్యవతి(80) చెల్లెలితో కలిసి ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారు జామున అపార్ట్‌మెంట్‌ భవనంపైకి ఎక్కి వాకింగ్‌ చేస్తున్న సమయంలో కళ్లు తిరగడంతో కాలు జారి పైనుంచి కిందకు పడిపోయింది. స్థానికులు చూసి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సత్యవతికి ఎవరూ లేకపోవడంతో చెల్లెలితో కలిసి ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంటిలో ఉంటున్నారు.

గాయపడిన వ్యక్తి..

రణస్థలం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై ఈనెల 16న నెలివాడ జంక్షన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరువాడ గ్రామానికి చెందిన లెంక మోహనరావు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారి సీతయ్య (27) విశాఖ కేజీహెచ్‌ లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 12:28 AM