మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - May 29 , 2026 | 12:12 AM
పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ జయరామచంద్రపురం గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు(28) అనే యువకుడు మనస్తాపంతో చెట్టుకు ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పలాస, మే 28 (ఆంధ్రజ్యోతి): పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ జయరామచంద్రపురం గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు(28) అనే యువకుడు మనస్తాపంతో చెట్టుకు ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి...పూడి చిన్నబాబు ఆటో, ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అవివాహితుడైన ఆయన బుధవారం మధ్యాహ్నం తాళభద్ర జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాలకు వెళ్లాడు. అక్కడ పి.శేఖర్ అనే వ్యక్తితో ఘర్షణ జరిగింది. శేఖర్ బీరుబాటిల్‌తో చిన్నబాబును కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అందరి మధ్యలో కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నబాబు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళుతూ తన మిత్రులకు వాట్సాప్ మెసేజ్ చేశాడు. తనకు అవమానం జరిగిందని... ఇక తాను బతకడం ఎందుకని... చావబోతున్నానని చెప్పడంతో గ్రామంలో యువకులంతా ఆయన కోసం వెతికారు. చివరకు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం అందరూ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి సమయంలో సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గ్రామానికి సమీపంలోని తోటల్లో ఉన్నట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి వారు చేరుకున్న సమయానికే చిన్నబాబు మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.