దేశీయ ఉత్తత్పుల తయారీకి యువ ఇంజనీర్లు తోడ్పడాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:16 AM
మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి దేశీయ ఉత్పత్తుల తయారీకి యువ ఇంజనీర్లు తోడ్పడాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు.
- ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
టెక్కలి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి దేశీయ ఉత్పత్తుల తయారీకి యువ ఇంజనీర్లు తోడ్పడాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. కె.కొత్తూరు దరి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం సిల్వర్ జూబ్లీ పదో గ్రాడ్యూషన్‌డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంబంపాటి హాజరై పలువురు విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ‘పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్ కేంద్రాల అభివృద్ధి, దేశీయ ఉత్పత్తుల రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఇంధన అవసరాలకు పరిష్కారం చూపే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ముందుండాలి. ఆత్మ నిర్బర్ భారత్‌గా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి, వ్యాపార ఆలోచనలు, నూతన సంస్థల స్థాపనపై దృష్టి సారించాలి.’అని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఐతం సమాచార సాంకేతిక విభాగానికి చెందిన పూర్వపు విద్యార్థులు జి.శ్యామ్‌కుమార్, టి.ఉదయ్‌కిరణ్ స్థాపించిన నూతన సంస్థలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యలో గవర్నర్ హరిబాబు 25ఏళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్‌ఎల్ నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, నాగశేషు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, రవికుమార్, మధుకుమార్, బుడుమూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.